ఫొటోల మోజులో ఘోర విషాదం.. నలుగురు మహిళలతో సహా ఐదుగురు జలసమాధి!

by Malleboina Mahesh |

ఫొటోల కోసం వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మహిళలతో సహా ఐదుగురు జలసమాధి అయిన షాకింగ్ సంఘటన కర్ణాటక కావేరి నదిలో చోటు చేసుకుంది.

ఫొటోల మోజులో ఘోర విషాదం.. నలుగురు మహిళలతో సహా ఐదుగురు జలసమాధి!
X

దిశ, వెబ్ డెస్క్: నదిలో దిగి కుటుంబంతో కలిసి.. సరదాగా ఫోటోలు దిగుతున్న ఓ కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. నలుగురు మహిళలు సహా, కారు డ్రైవర్ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన కర్ణాటకలోని మండ్య జిల్లా ముత్తత్తి సమీపంలో కావేరి నదిలో చోటుచేసుకుంది. ఈ ఘోర ప్రమాదం ఒకే కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. కుటుంబ సభ్యులతో కలిసి ముత్తేతరాయ ఆలయ దర్శనానికి వచ్చిన వారంతా సాయంత్రం వేళ కావేరి నది వద్దకు చేరుకున్నారు.

నది ప్రవాహం తక్కువగానే ఉందని భావించి, ఫొటోలు, సెల్ఫీలు దిగడానికి కుటుంబంలోని మహిళలు నీటిలోకి దిగారు. ఈ క్రమంలో విజయమ్మ (50) ప్రమాదవశాత్తు నదిలోని లోతైన ప్రాంతంలోకి జారిపోగా, ఆమెను కాపాడే ప్రయత్నంలో శ్వేత (38), ప్రియాంక (28), చైత్ర (20) లతో పాటు కారు డ్రైవర్ మహేష్ కూడా బలమైన ప్రవాహంలో కొట్టుకుపోయి జలసమాధి అయ్యారు. ఈ ప్రమాదం జరగడానికి కేవలం కొన్ని నిమిషాల ముందే వారు తీసుకున్న చివరి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అందరినీ కలచివేస్తోంది.

ఈ ప్రమాదం నుండి రవి అనే కుటుంబ సభ్యుడితో పాటు ఒడ్డునే ఉన్న ఒక 4 ఏళ్ల చిన్నారి ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న హలగూరు పోలీసులు, రెస్క్యూ సిబ్బంది స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి ఐదుగురి మృతదేహాలను నదిలో నుండి వెలికితీశారు. నదులు పైకి ఎంత ప్రశాంతంగా కనిపించినప్పటికీ లోపల ఉండే బలమైన సుడిగుండాలు, ప్రవాహాలు అత్యంత ప్రమాదకరమని అధికారులు హెచ్చరిస్తున్నారు. పర్యాటక ప్రాంతాల్లో ఉంచే భద్రతా హెచ్చరికలను నిర్లక్ష్యం చేయవద్దని, కేవలం ఫొటోలు, వీడియోల మోజులో పడి క్షణకాలం చేసే తప్పులు జీవితకాలం పాటు కోలుకోలేని ఆవేదనను మిగులుస్తాయని పోలీసులు ఈ సందర్భంగా ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.

Next Story