పాఠశాల క్వార్టర్స్‌లో కేరళ టీచర్ ఉరేసుకుని ఆత్మహత్య

by Jakkula.Mamatha |

కామారెడ్డి జిల్లా కామారెడ్డి మండల పరిధిలో బుధవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది.

పాఠశాల క్వార్టర్స్‌లో కేరళ టీచర్ ఉరేసుకుని ఆత్మహత్య
X

దిశ, కామారెడ్డి రూరల్: కామారెడ్డి జిల్లా, మండల పరిధిలో బుధవారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. స్థానిక ఒక ప్రైవేటు పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న కేరళకు చెందిన ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. పాఠశాలకు సంబంధించిన క్వార్టర్స్ లోనే ఆమె బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళ రాష్ట్రానికి చెందిన దేవిక విల్లా అనే ఉపాధ్యాయురాలు కామారెడ్డి పట్టణ సమీపంలోని ఒక ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలో పాఠాలు బోధించేందుకు పది రోజుల క్రితమే ఇక్కడికి వచ్చి చేరినట్లు తెలిపారు. నర్సన్నపల్లి గ్రామంలోని ప్రైవేటు పాఠశాల క్వార్టర్స్‌కు సంబంధించిన ఒక ఇంట్లో ఆమె నివాసముంటున్నారు. దేవిక విల్లా బుధవారం సాయంత్రం తన గదిలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు.

సమాచారం అందుకున్న దేవునిపల్లి రూరల్ ఎస్సై రంజిత్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అయితే, ఆమె ఆత్మహత్యకు గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటన పై దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె అంత తీవ్రమైన నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు. సాధారణంగా విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు కేరళకు చెందిన ఉపాధ్యాయులను ఇక్కడి ప్రైవేటు విద్యాసంస్థలు విద్యను ఉన్నతంగా బోధించటానికి ప్రత్యేకంగా రప్పించుకుంటారు. ఈ క్రమంలోనే వచ్చిన సదరు ఉపాధ్యాయురాలు చేరిన కొద్ది రోజుల్లోనే ఇలా విగతజీవిగా మారడంతో తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

Next Story