ఎస్ఐఆర్‌‌పై అధికారుల నజర్..!

by Jakkula.Mamatha |

ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) గడువు దగ్గర పడుతుండటంతో యంత్రాంగం అలర్ట్ అయ్యింది.

ఎస్ఐఆర్‌‌పై అధికారుల నజర్..!
X

దిశ, వరంగల్ బ్యూరో: ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) గడువు దగ్గర పడుతుండటంతో యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ఇప్పటికే నిర్ణీత షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాల్సి ఉన్నా ఆలస్యం కావడంతో పోలింగ్ బూత్ ల ఆధారంగా సమీక్షిస్తున్నారు. వెనుకబడి ఉన్న పోలింగ్ బూత్ లకు జిల్లా అధికారులను ఇంచార్జీలుగా నియమించి డిజిటలైజేషన్ ప్రక్రియను మెరుగయ్యే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెలాఖరులోపు సమగ్ర సవరణను పూర్తి చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం ఉమ్మడి జిల్లాలో కొనసాగుతుంది. అన్ని జిల్లాల పరిధిలో కలెక్టర్లు నిత్యం సమీక్షిస్తూనే డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎప్పటికప్పుడు బూత్ ల వారీగా పరిశీలిస్తూ ఓటరు డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయ్యే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఎన్యుమరేషన్ ఫారాలను ముందే పంపిణీ చేసిన అధికారులు డిజిటలైజేషన్ ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మహిళలకు సంబంధించి ఓట్లు లేకపోవడం, 2002 కు ముందు వివరాలు తక్కువగా ఉండటం, తల్లిదండ్రుల పేర్లకు సంబంధించి వివరాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఆలస్యమవుతుంది.

ఉమ్మడి జిల్లా పరిధిలోని 12 నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ బూత్ ల ఆధారంగా డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు.ఆగస్టు 3 డెడ్ లైన్ కావడంతో ఈనెలాఖరులోపే పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్యుమరేషన్ ఫారాలను అన్ని చోట్ల అందించిన కొన్ని ఇండ్ల పరిధిలో వారు లేకపోవడం, బీఎల్ఓలు, బీఎల్ఏలు వెళ్లినప్పుడు వారు అందుబాటులో లేకపోవడం వల్ల సమస్యలు ఎదురవుతున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇప్పటి వరకు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో భారీగానే ఎన్యుమరేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. పూర్తిస్థాయిలో చేసేందుకు చర్యలు చేపట్టారు.

జనగామ జిల్లా పరిధిలో 7లక్షల 67వేల 484 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ వంద శాతం ఎన్యుమరేషన్ ఫారాలను అందించారు. ఇప్పటి వరకు 6లక్షల 87వేల 111 మంది ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. ఈ జిల్లా పరిధిలో 90 శాతం పూర్తి చేశారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలో 4లక్షల 84వేల 935 మంది ఓటర్లు ఉండగా అంతే మందికి ఎన్యుమరేషన్ ఫారాలను అందించారు. 4 లక్షల 27వేల 913 మంది ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. 88.24 శాతం పూర్తి చేశారు. వరంగల్ జిల్లా పరిధిలో 7లక్షల 76వేల 953 మంది ఓటర్లు ఉండగా అంతే మొత్తంలో ఎన్యుమరేషన్ ఫారాలను అందించారు. జిల్లాలో 6లక్షల 58వేల 875 మంది ఓటర్ల డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. 85 శాతం ఈ జిల్లా పరిధిలో పూర్తయ్యింది.

హన్మకొండ జిల్లా పరిధిలో 5లక్షల 9వేల 14 మంది ఓటర్లు ఉండగా అంతే మొత్తంలో ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 3లక్షల 91 వేల 63 మంది డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. 77 శాతం పూర్తయింది. భూపాలపల్లి జిల్లాలో 2లక్షల 77వేల 882 మంది ఓటర్లు ఉండగా అంతే మొత్తంలో ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 2లక్షల 34వేల 809 మంది డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ములుగు జిల్లాలో 2 లక్షల 36 వేల 970 మంది ఓటర్లు ఉండగా 2లక్షల 5వేల 910 మంది డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఎక్కడైనా పోలింగ్ బూత్ లో తక్కువగా శాతం నమోదైతే ఆ బూత్ లకు ప్రత్యేక అధికారులను నియమించి పూర్తయ్యే విధంగా ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిర్ణీత సమయంలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వడంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.

వరంగల్ కార్పొరేషన్ పరిధిలో తగ్గనున్న ఓటర్లు..

వరంగల్ నగరానికి ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ఓటర్లు వివిధ పనుల కోసం వచ్చి ఇక్కడే నివసిస్తున్నారు. కొంత మంది ఉద్యోగాలు చేస్తుండగా మరికొంత మంది వ్యాపారం చేస్తున్నారు. ఇంకొంత మంది గ్రామాల్లో వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివించుకునేందుకు వరంగల్ నగరంలో నివాసం ఉంటున్నారు. వీరిలో కొంత మందికి నగరంతో పాటు గ్రామాల్లో ఓటు ఉంది. ప్రస్తుతం ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ వల్ల ఏదో ఒక చోట ఓటు ఉంచుకునే పరిస్థితి ఏర్పడింది. ఒకే చోట ఓటు ఉండాలనే నిబంధనలు తప్పనిసరి చేయడంతో చాలా మంది ఓటర్లు గ్రామాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వారి గ్రామాల పరిధిలోని ఓటుకు ఎన్యూమరేషన్ ఫారాలను నింపి అందిస్తున్నారు. నగరం పరిధిలోని ఓటును వదులుకుంటున్నారు. ఆయా పార్టీల బీఎల్ఏలు ఓటర్లకు నచ్చచెబుతున్నా ఎక్కువ మంది మాత్రం గ్రామాలకే ప్రాధాన్యతను ఇస్తున్నారు. దీనివల్ల వరంగల్ నగరం పరిధిలోని రెండు నియోజకవర్గాల పరిధిలో గణనీయంగా ఓట్లు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. అధికారులు మాత్రం నిబంధనల ప్రకారం డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నారు. ఈ నెలాఖరులోపు మొత్తం పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story