- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ చేపల చెరువు నిర్మాణంపై అధికారుల పరిశీలన
నర్వ మండల కేంద్రంలోని పెద్ద చెరువుకు వచ్చే సహజ నీటి ప్రవాహానికి అడ్డుగా చేపల చెరువు నిర్మాణం జరుగుతోందని గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో అధికార యంత్రాంగం స్పందించింది.

దిశ, నర్వ : నర్వ మండల కేంద్రంలోని పెద్ద చెరువుకు వచ్చే సహజ నీటి ప్రవాహానికి అడ్డుగా చేపల చెరువు నిర్మాణం జరుగుతోందని గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో అధికార యంత్రాంగం స్పందించింది. గురువారం జిల్లా మత్స్యశాఖ, ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ అధికారులు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మత్స్యశాఖ జూనియర్ అసిస్టెంట్ నాగరాజు, ఫీల్డ్ ఆఫీసర్ వర్ధన్, ఇరిగేషన్ శాఖ డీఈ నాయిముద్దీన్, నర్వ తహసీల్దార్ మల్లారెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అధికారులకు సమస్య తీవ్రతను వివరించారు. చేపల చెరువు నిర్మాణం వల్ల నర్వ పెద్ద చెరువుకు వచ్చే సహజ నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి **నర్వ, యాంకి తదితర గ్రామాల రైతుల పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.
అలాగే నర్వ చెరువుకు నీరు చేరకపోతే యాంకి చెరువుకు కూడా నీటి ప్రవాహం నిలిచిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చేపల చెరువులోని వ్యర్థ జలాలు నర్వ పెద్ద చెరువులోకి చేరే అవకాశం ఉందని, దీనివల్ల చెరువులు కలుషితమై ప్రజలు, రైతులు, పశువులు, పంటలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఒకరి ప్రయోజనం కోసం మూడు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి సంబంధిత వివరాలను సేకరించారు. పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించి, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నర్వ తహసీల్దార్ మల్లారెడ్డి, గ్రామ సర్పంచ్ హనుమంత్ రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, రైతులు పాల్గొన్నారు.






