అప్రకటిత కరెంట్ కోతలతో అన్నదాతల ఆందోళన.. పట్టించుకోని అధికారులు

by Jakkula.Mamatha |

అప్రకటిత కరెంట్ కోతలతో లింగంపేట విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల ప్రజలు నిత్యం సతమతమవుతున్నారు.

అప్రకటిత కరెంట్ కోతలతో అన్నదాతల ఆందోళన.. పట్టించుకోని అధికారులు
X

దిశ, లింగంపేట: అప్రకటిత కరెంట్ కోతలతో లింగంపేట విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల ప్రజలు నిత్యం సతమతమవుతున్నారు. రోజూ గంటల తరబడి అప్రకటిత కరెంట్ కోతలు విధించడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎండలు బాగా మండుతూ ఉండటంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రతిరోజు ఎనిమిది నుంచి పది సార్లు కరెంటు కోతలు విధిస్తున్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వానకాలం సీజన్ ప్రారంభం కావడంతో అన్నదాతలు బోరు బావుల వద్ద వరి నారు మడులు వేసేందుకు సిద్ధపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో రైతులు వరి నారు మడులు పోశారు.

వ్యవసాయ భూముల దుక్కులు సిద్ధం చేసుకునేందుకు రైతులు సిద్ధపడుతుండగా అప్రకటిత కరెంట్ కోతలు వారి పాలిట శాపంగా మారాయి. కరెంటు వైర్లు తెగిపడ్డాయని, ట్రాన్సాఫార్మర్‌లో సాంకేతిక లోపం ఏర్పడిందని, ట్రిప్ అయ్యిందనే సాకులతో ట్రాన్స్ కో సిబ్బంది కరెంటు కోతలు విధిస్తున్నారని ఆయా గ్రామాల వినియోగ దారులు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మండలంలోని మెంగారం, బోనాల్ గ్రామాల ప్రజలు రైతులు అప్రకటిత కరెంట్ కోతలతో నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. కరెంటు కోతల కారణంగా కనీసం వరి నారు మడులకు సాగునీటి ని అందించలేక పోతున్నామని రెండు గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఎల్‌సీల పేరిట కరెంటు కోతలు..

వ్యవసాయ రంగానికి, గృహ వినియోగదారులకు 24 గంటలు నిరంతర కరెంటు సరఫరా చేస్తున్నామని ఓ పక్క చెబుతుండగా ఎల్ సీ( లైన్ క్లియర్ )ల పేరిట మరో పక్క కోతలు విధిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. లింగంపేట మండలంలోని మెంగారం,బోనాల్ గ్రామాల్లో రోజుకు ఐదు నుంచి ఆరు గంటల పాటు కరెంటు కోతలు విధిస్తు న్నారని రెండు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. అప్రకటిత కరెంట్ కోతలపై మెంగారం, బోనాల్ గ్రామాలకు చెందిన ట్రాన్స్కో లైన్మెన్, జూనియర్ లైన్మెన్ లను అడిగితే కరెంటు ట్రిప్ అవుతోందని, ట్రాన్స్ఫార్మర్ వద్ద రిపేర్ చేస్తున్నామని చెబుతూ కాలయాపన చేస్తున్నారని రెండు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.

బోనాల్ గ్రామానికి సపరేట్ లైన్ వేయాలి..

లింగంపేట విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి బోనాల్ గ్రామానికి సపరేట్ లైన్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా చేయాలని మెంగారం గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. గతంలో బోనాల్ గ్రామానికి మండలంలోని బాణాపూర్ విద్యుత్ సబ్ స్టే షన్ నుంచి కరెంటు సరఫరా చేసేవారు. ఓవర్ లోడ్ కారణంగా తరచూ కరెంటు కోతలు ఏర్పడడంతో బానాపూర్ గ్రామస్తులు నిరంతర కరెంట్ సరఫరా చేయాలని కోరుతూ ధర్నా రాస్తారోకో చేపట్టారు. దీంతో హుటాహుటిన స్పందించిన ట్రాన్స్కో అధికారులు బానాపూర్ విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి బోనాల్ గ్రామానికి కరెంట్ సరఫరా నిలిపివేశారు. లింగంపేట విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి మెంగారం ఫీడర్ ద్వారా బోనాల్ గ్రామానికి కరెంట్ సరఫరా చేస్తున్నారు. దీంతో లోడ్ అధికమై తరచూ కరెంట్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. విద్యుత్ వైర్లు తెగిపోవడం, సబ్ స్టేషన్‌లో బ్రేక్ డౌన్ కావడం, తరచూ కరెంటు సరఫరా ట్రిప్ అవడం కారణంగా అప్రకటిత కరెంట్ కోతలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా కరెంటు వినియోగ దారులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మండల కేంద్రంలో భారీగా కోతలు..

లింగంపేట మండల కేంద్రంలో భారీగా కరెంటు కోతలు విధిస్తున్నారు. దీంతో వ్యాపారులు, కుటీర పరిశ్రమల నిర్వాహకులు నష్టపోతున్నారు. కరెంటు కోతల వల్ల వ్యాపారాలు సాగడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రాల్లో 24 గంటలు నిరంతర కరెంటు సరఫరా చేయాల్సి ఉన్నప్పటికిని ట్రాన్స్కో అధికారుల నిర్లక్ష్యం వల్ల 24 గంటల కరెంటు సరఫరాను చేయలేక పోతున్నారు. మండల కేంద్రంలో సైతం ఎల్ సీ ల పేరిట గంటల తరబడి కోతలు విధించడం పట్ల కరెంట్ వినియోగ దారులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

పర్యవేక్షణ లోపమే కారణమా..

లింగంపేట మండలంలో గత కొన్ని నెలలుగా అప్రకటిత కరెంట్ కోతలతో వినియోదారులు సతమతమవుతున్న ట్రాన్స్ కో అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ట్రాన్స్ కో మండల స్థాయి అధికారులు, కిందిస్థాయి సిబ్బంది స్థానికంగా ఉండని కారణంగా కరెంటు కోతలు ఏర్పడుతున్నాయని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. జిల్లా స్థాయి ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం కారణంగా కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

Next Story