- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీహెచ్ఎంసీ ఆదాయ, వ్యయాలపై అధికారుల కసరత్తు
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) విభజన ప్రక్రియ వేగంగా జరుగుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) విభజన ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇప్పటికే టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్, శానిటేషన్ విభాగాలకు సంబంధించిన అధికారుల కేటాయింపు కూడా పూర్తయింది. ఇక జీహెచ్ఎంసీ అప్పులు, ఆదాయం, వ్యయాల విభజనపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. గ్రేటర్ పరిధిలోని చేపట్టిన ఎస్ఆర్డీపీ ప్రాజెక్టుల కోసం సుమారు రూ.6 వేల కోట్ల అప్పులు చేసింది. ప్రస్తుతం రూ.4,717 కోట్లు ఉన్నాయి. వీటితోపాటు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు కూడా ఉన్నాయి. వీటన్నింటిని పరిశీలించిన పంచడానికి ఐఏఎస్ అధికారులతో కమిటీని నియమించిన విషయం తెలిసిందే. అయితే ఈనెల 10వ తేదిన పాలకవర్గం గడువు ముగియనుండడంతో విభజన ప్రక్రియను వేగవంతం చేసినట్టు అధికారులు చెబుతున్నారు.
విభజనలో అత్యంత కీలకం అప్పులే..
జీహెచ్ఎంసీ విభజనలో అత్యంత కీలకమైనది అప్పులేనని అధికారులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీకి ప్రస్తుతం రూ. 4,717 కోట్ల అప్పులు ఉన్నాయి. బ్యాంక్ లోన్లు, బాండ్లు, ఏజెన్సీల బకాయిలు, కాంట్రాక్టర్ పెండింగ్స్ ఇవన్నీ కలిపితే విభజన తర్వాత వీటిని ఎలా పంచాలన్నదే అసలు చిక్కు. ఇక అప్పుల పంపకంపై పలు రకాల ఊహా గానాలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ ఎక్కువ ఉన్న కోర్ సిటీకి అప్పుల భారం ఎక్కువా? విలీన ప్రాంతాలకు కొత్తగా ఏర్పడే కార్పొరేషన్లపై అప్పుల భారం ఎంత ? లేక రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందా ? ఈ మూడు మార్గాలపై స్పష్టత కరువైంది. దీంతోపాటు మూడు మున్సిపల్ కార్పొరేషన్ల విభజనతో పాటు మూడింటికి అప్పులను ఏ ప్రాతిపదికన పంచుతారనే విషయాలపై అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.
అయితే జీహెచ్ఎంసీకి ప్రధాన ఆదాయ వనరులైన ప్రాపర్టీ ట్యాక్స్, టౌన్ ప్లానింగ్ వచ్చే ఫీజులు అత్యధికంగా పాత శేరిలింగంపల్లి, చందానగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, ఎల్బీనగర్ సర్కిళ్ల నుంచే వచ్చాయి. దీంతోపాటు విలీనం మున్సిపాలిటీలను పరిశీలిస్తే తుర్కయంజాల్, ఆదిభట్ల, మణికొండ, బండ్లగూడ జాగీర్, నిజాంపేట్, పెద్ద అంబర్ పేట్, బోడుప్పల్ ప్రాంతాల నుంచి సైతం భారీగా ఆదాయం వచ్చింది. ఆదాయ వనరుల ఆధారంగా అప్పులను పంపిణీ చేస్తారా? అభివృద్ధి కార్యక్రమాలను ఆధారంగా చేస్తారా? స్పష్టత రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
ఈ నెల 11 తర్వాత
జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు ఈనెల 10న సాయంత్రం 5గంటల వరకు ముగియనుంది. అనంతరం స్పెషల్ ఆఫీసర్ పాలన రానుంది. ఈనెల 11 నుంచి జీహెచ్ఎంసీ విభజనకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు చకచక జరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈనెల 10వ తేదీ వరకు అన్ని అంశాలకు సంబంధించిన రిపోర్టు తయారు చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా శానిటేషన్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.
పైనాన్సియల్ రేటింగ్స్..
జీహెచ్ఎంసీ సుమారు రూ.6 వేల కోట్ల అప్పులు తీసుకున్నది. ప్రతినెల అసలు, వడ్డీ కలిపి సుమారు రూ.150 కోట్ల వరకు చెల్లిస్తోంది. అప్పులు తీసుకోవడం, వాటిని క్రమం తప్పకుండా చెల్లించడంతో ఎనిమిదేండ్లు జీహెచ్ఎంసీ ‘ఏఏ స్టేబుల్’ రేటింగ్ కొనసాగుతోంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ), గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీసీఎంసీ), గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (జీఎంఎంసీ) లుగా విభజించిన తర్వాత ఏ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎంత అప్పు వస్తుంది? ఆదాయం వచ్చే వనరులేమున్నాయి? కాంట్రాక్టర్ల బిల్లుల విలువ ఎంత? ఏ స్థాయి రేటింగ్ ఉంటుంది? అనే అంశాలపై అధికారులు స్టడీ రిపోర్టు తయారు చేసినట్లు తెలిసింది.
- Tags
- GHMC






