చింతలకుంటలో అక్రమ నిర్మాణం..

by Kodari Anjali |

గృహ నిర్మాణ అనుమతులు పొంది నివాసప్రాంతంలో భారీ వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నారు.

చింతలకుంటలో అక్రమ నిర్మాణం..
X

దిశ, చైతన్యపురి: గృహ నిర్మాణ అనుమతులు పొంది నివాసప్రాంతంలో భారీ వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నారు. ఆక్యుపెన్సివ్ సర్టిఫికెట్ పొందిన తర్వాత తిరిగి పైన మరో అంతస్తు రేకుల ద్వారా ఏర్పాటు చేసి ఫ్లోర్‌గా నిర్మాణం చేస్తున్న సంఘటన మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీనగర్ జోన్ నాగోల్ సర్కిల్ పరిధిలోని మన్సూరాబాద్ డివిజన్లో చింతలకుంట జాతీయ రహదారి ఆనుకొని ఉన్న ప్రధాన వాణిజ్య భవనం.

అదనపు ఫ్లోర్ నిర్మాణం...

మన్సూరాబాద్ డివిజన్ చింతలకుంట ఆగమయ్యనగర్ కాలనీ ప్రారంభంలో జాతీయ రహదారిపై వాణిజ్య భవన నిర్మాణం గతంలో ఉంది. ఈ భవన నిర్మాణం సమయంలో గృహనిర్మాణ అనుమతులు పొంది వాణిజ్య భవననిర్మాణం నిర్మించారు. ప్రస్తుతం ఈ భవనంలో విశాల్ మార్ట్ కు అద్దెకు ఇచ్చారు. మున్సిపల్ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా గతంలో సెల్లార్ నిర్మించారు. ఆక్యుపెన్సివ్ సర్టిఫికెట్ పొందిన తర్వాత ఎవరేం చేస్తారులే అనే ధీమాతో పైన రేకుల ద్వారా మరో ఫ్లోర్ ను నిర్మాణం చేసి వినియోగంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. యథేచ్చగా పైన అంతస్తు నిర్మాణం జరుగుతున్నా నాగోల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసిపి, సెక్షన్ ఆఫీసర్ రామచందర్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

ఖజానాకు భారీగండి...

టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల మున్సిపల్ ఆదాయానికి రావాల్సిన లక్షలాది రూపాయలు రాకుండా పోతున్నాయి. ఇలాంటి అక్రమ నిర్మాణాలపై నాన్చివేతధోరణితో వ్యవహరిస్తున్నారనే అపవాదు ఉంది.

తప్పుడు అఫిడవిట్...

అక్రమ నిర్మాణంపై టౌన్ ప్లానింగ్ అధికారులు భవన యజమానికి నోటీసులు అందించారు. వాటిని సవాలు చేస్తూ సంబంధిత యజమాని కోర్టుకు వెళ్లినట్లు తెలిసింది. తమ భవనంపై సోలార్ రూఫ్ వేసుకుంటున్నారని తప్పుడు ఆఫిడవిట్ సమర్పించి భవనాన్ని పూర్తిచేసి అధికారులకు తప్పుడు సమాచారం అందించారని ఆరోపణలున్నాయి. ఇలాంటి నిబంధనలు అతిక్రమించిన యజమానిపై నాగోల్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Next Story