- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇటుక బట్టీలు యజమానులతో అధికారుల 'కుమ్మక్కు'.. ప్రజావాణిలో గ్రామస్తుల ఫిర్యాదు!
కరీంనగర్ మండలం ఇరుకుల్లలో అక్రమ ఇటుకబట్టీలకు ఎన్ఓసీ ఇచ్చేందుకు అధికారులు తప్పుడు తీర్మానాలు చేశారని గ్రామస్తులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

దిశ, కరీంనగర్ రూరల్: ఇటుక బట్టీ నిర్వాహకులతో కలిసి కుమ్మక్కై ఎన్వోసీ జారీకి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి గ్రామస్తులు ఇటీవల ప్రజావాణిలో కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. కరీంనగర్ మండలం ఇరుకుల్ల గ్రామంలో గత కొంత కాలంగా ఇటుక బట్టీల నిర్వహణ పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. గ్రామ సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా సుమారు 50 ఎకరాల్లో అక్రమంగా ఇటుక బట్టీలు నిర్వహిస్తూ గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి కొడుతున్నారు.
ఈ నేపథ్యంలో గత సంవత్సరం జులై 7న ఎంకేఆర్, వైఎంకె, వీబీసీ ఇటుక బట్టీల నిర్వాహకులు ఎన్ఓసీ కొరకై గ్రామ పంచాయతీ అధికారిని ఆశ్రయించగా జూలై 17వ తేదీన ఎంపీవో జగన్ మోహన్ రెడ్డి,స్పెషల్ ఆఫీసర్ వైశాలి, కార్యదర్శి సంతోష్ అత్యవసరంగా గ్రామ సభ నిర్వహించి గ్రామస్తులకు తప్పుడు సమాచారం ఇవ్వడంతోపాటు గ్రామ సభలో తప్పుడు ఎజెండా రూపొదించారు. ముందస్తుగా కార్యదర్శి సంతోష్ తీర్మానం బుక్ లో గ్రామస్తుల సంతకాలు స్వీకరించి ఆ తర్వాత గ్రామ సభలో గ్రామస్తులు తీర్మానం చేసినట్టుగా రూపొదించారని కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు లేఖలో ఆరోపించారు.
ఆ రోజు గ్రామ సభ నిర్వహించింది కేవలం ఇటుక బట్టి నిర్వాహకులకు అన్ని రకాల అనుమతులు మంజూరు అయ్యాకే పనులు చేపట్టాలని లేదంటే పనులు నిలిపివేయాలని సభలో తీర్మానం చేశామని గుర్తు చేశారు. గ్రామ సభలో ఆ రోజున పది మంది కూడా హాజరు కాలేకున్న కార్యదర్శి సంతోష్, ఎంపీవో జగన్మోహన్ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ వైశాలి వీరు గ్రామసభకు హాజరు కాని వారీ సంతకాలు తీర్మాన కాపీ లో చేర్చి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. గ్రామస్తులను తప్పుదారి పట్టించి ఎన్ఓసీ ఇచ్చిన ఎంపీవో జగన్ మోహన్ రెడ్డి,స్పెషల్ ఆఫీసర్ వైశాలి,కార్యదర్శి సంతోష్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఇందుకు సహకరించిన వారిపై ప్రత్యేక విచారణ జరపాలని కోరారు.
అలాగే ఎంకేఆర్, వైఎంకే, వీబీసీ ఇటుక బట్టీల అనుమతులు వచ్చేంత వరకు పనులు నిలిపి వేయాలని జిల్లా కలెక్టర్ ని లేఖ ద్వారా కోరారు. జిల్లా కలెక్టర్ కు అవినీతి పై ఫిర్యాదు చేసి రోజులు గడుస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ఇటీవల ఎలాంటి ఫిర్యాదు రాలేదని స్థానిక ఎంపీవో జగన్మోహన్ రెడ్డి తెలపడం గమనార్హం.






