- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ రియల్ దందాకు అధికారుల అండ..!?
రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కడ ఎలా పనులు సాఫీగా చేసుకోవాలో మాకు తెలుసు.. ఆ క్రమంలోనే అధికారులకు అందాల్సిందంతా ముందుగానే అందించాం..

దిశ నల్లగొండ బ్యూరో: రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కడ ఎలా పనులు సాఫీగా చేసుకోవాలో మాకు తెలుసు.. ఆ క్రమంలోనే అధికారులకు అందాల్సిందంతా ముందుగానే అందించాం.. అందుకే అధికారులు అంతా మాకు అండగా ఉన్నారు... ఎవరేమి చేసిన మా రియల్ వ్యాపారానికి ఇక తిరుగులేదు. అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు బహిరంగంగానే మాట్లాడుతున్న పరిస్థితులు చింతపల్లి మండలంలో ప్రచారం జరుగుతుంది.. ఇంతగా ఓపెన్ టాక్ జరుగుతుందంటే రియల్ వ్యాపారులకు ప్రభుత్వ అధికారులు ఎంతగా భరోసా కల్పించారో అర్థమవుతుంది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంతో మాకు సంబంధం లేదు మా జేబులు నిండుతున్నాయా లేదా అన్నంతగా అధికారులు వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఒక డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్లు చేస్తుండగా.,.. మరొక డిపార్ట్మెంట్ ఫామ్ ల్యాండ్ వెంచర్ యజమానులకు నోటీసులు అందజేసినట్లు తెలుస్తోంది
హైవే పక్కనే వెంచర్..
హైదరాబాదుకు అతి సమీపంలో హైదరాబాదు నాగార్జునసాగర్ జాతీయ రహదారిలో ఉన్న చింతపల్లి మండల కేంద్రంలో సాన్విక థీమ్ ఫామ్స్ వెంచర్ పేరుతో 476/ p, 483/p. 484/p సర్వే నెంబర్లలో ఫామ్ ల్యాండ్ వెంచర్ ఏర్పాటు చేశారు.
ఒకవైపు రిజిస్ట్రేషన్.. మరొక వైపు నోటీసులు..
చింతపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ నిబంధనలతో సంబంధం లేకుండా వెంచర్ ఏర్పాటు చేశారు. ఆ వెంచర్ కు రెవెన్యూ, పంచాయతీ అధికారులు పూర్తిస్థాయిలో అండగా ఉన్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ భూమి తరహాలో గుంటలుగా రిజిస్ట్రేషన్ చేయాలంటే మండల రెవెన్యూ కార్యాలయంలో చేస్తారు. కానీ రియల్ వ్యాపారులు వెంచర్ లో రోడ్లు నిర్మాణం చేసి 121 గజాల పేరుతో ప్లాట్లు చేశారు. ఇది స్పష్టంగా కళ్ళ కు కనిపిస్తుంది. అయినా అధికారులు వ్యవసాయ భూమి అంటూ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఇదంతా తెలిసి కూడా పంచాయతీ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
పత్రికల్లో వచ్చిన తర్వాత సాధారణంగా రియల్ వ్యాపారులకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. పత్రికల్లో వచ్చిన తర్వాత పంచాయతీ అధికారులు స్పందిస్తున్నారే కానీ సుమారు ఏడాదికాలంగా వెంచర్లు పనులు జరుగుతుంటే ఏం చేశారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ నిబంధనల ప్రకారం వెంచర్ ఏర్పాటు చేసి ఉంటే గ్రామపంచాయతీకి ఆదాయం వచ్చేది... తద్వారా అభివృద్ధి పనులు చేసుకునే అవకాశం ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. కానీ రెవెన్యూ , పంచాయతీ అధికారులు కుమ్మక్కై ఎవరి వాటా వాళ్లు పంచుకొని రియల్ వ్యాపారికి అండగా ఉన్నట్లు తెలుస్తోంది
భవిష్యత్ పేరుతో..
మన దోస్త్ చెప్పారని బంధువులు ఒత్తిడి చేస్తున్నారని ఏదో ఒక రకంగా సరేలే భవిష్యత్తుకు ఇంటి స్థలం ఉపయోగపడుతుందనే పేరుతో ఆశపడి తే భంగపాటు తప్పదేమో ఆలోచించి అడుగు అడుగు వేయాల్సిన అవసరం ఉంది. మన దగ్గర వాళ్లంతా కొనుగోలు చేశారని ఏ ఇబ్బంది ఉండదని, అన్ని రకాల అనుమతులు ఉన్నాయా లేవా అని చూసుకోకుండా చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారి దగ్గర ప్లాట్ కొనుగోలు చేస్తున్నాం. కానీ ప్లాట్ కొనుగోలు చేసిన రెండు మూడు సంవత్సరాల తర్వాత ఆ ప్లాట్ అమ్మడానికి ప్రయత్నిస్తే రిజిస్ట్రేషన్ కాగితాల కు కూడా విలువ ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. నిర్మాణానికి లేదా బ్యాంకు రుణం తీసుకోవడానికి అవసరమైన సర్టిఫికెట్ కావాలని గ్రామ పంచాయతీ అధికారి దగ్గరికి వెళితే ఆ వెంచర్ కు అనుమతి లేదని చావు కబురు చల్లగా చెబుతున్నారు. ఈసీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు ఉన్నాయి కదా అని అడిగితే అధికారులు ప్రభుత్వం నుంచి అనుమతి లేదని సమాధానం వస్తుంది.
సాన్విక వెంచర్ కు అనుమతి లేదు:అశోక్, పంచాయతీ కార్యదర్శి, చింతపల్లి
సాన్విక ఫామ్ ల్యాండ్ వెంచర్ కు ఎలాంటి అనుమతులు లేవు. అలాగే వెంచర్ కి నోటీసులు ఇచ్చాం. నోటీస్ కి జవాబు వచ్చిన తర్వాత విచారించి చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం.






