- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, ఎల్బీనగర్: వందల ఏళ్ల నాటి నుండి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డ రాచబాట అది. ఓ మండలంలోని గ్రామం నుండి పక్క మండలంలోని గ్రామాలను కలుపుతూ జాతీయ రహదారికి వెళ్లే నక్షబాట. ఎంతో కాలంగా రైతులు ఆ బాట వెంటే రాకపోకలు చేస్తూ.. వ్యవసాయ కార్యకలాపాలు సాగిస్తూ వచ్చేవారు. కాలక్రమేనా కొందరు రైతులు తమ అవసరాల కోసం పొలాలను విక్రయించారు. ఇక ఆ నక్షబాటను ఆనుకొని పొలాలు కొన్న రియల్టర్‌ల కన్ను కాసా ఆ బాటపై పడింది. వెంటనే ఏ మాత్రం జంకు లేకుండా దర్జాగా కబ్జా చేసిన రియల్ మాయగాళ్ల భాగోతమిదీ..!
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండల పరిధిలోని బాగ్ హయత్‌నగర్ గ్రామ శివారులో నక్ష కబ్జాకు గురైంది. అబ్దులాపూర్ మెట్టు మండల పరిధిలోని కుంట్లూరు గ్రామ రోడ్డు నుండి హయత్‌నగర్ మండలం బాగ్ హయత్‌నగర్‌ను కలుపుతూ.. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని కలుపుతూ ఉన్న నక్షబాట అది. పూర్వీకుల నాటి నుండి రైతులు ఆ నక్షబాటను వాడుతూ వచ్చారు. కాగా భూముల ధరలు పెరగడం, రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ది చెందడంతొ రైతులు కొంత మంది తమ భూములను రియల్ వ్యాపారులకు అమ్ముకున్నారు.
దీంతో లాభార్జనే ద్యేయంగా వ్యాపారం సాగించే రియల్ మాఫియా తమ భూములకు ఆనుకుని ఉన్న నక్షబాటను యథేచ్చేగా కబ్జా చేశారు. కంట్లూరు గ్రామ శివారుకు హయత్‌నగర్ మండల శివారు ఆనుకొని ఉంటుంది. కంట్లూరు నుండి హయత్‌నగర్ మండల శివారు ఉన్న నక్షబాట మద్యలోకి వచ్చే సరికి మాయమయిపోయింది.
నక్షబాటను మింగిందేవరు..?
బాగ్ హయత్‌నగర్ గ్రామ రెవెన్యూ పరిధిలోకి వచ్చే 33 ఫీట్ల నక్షబాట దాదాపు 3 కిలో మీటర్లు విస్తరించి ఉంటుంది. దీనిని పూర్తిగా ఆక్రమించి రియల్టర్‌లు ఎవరికి వారు ప్లాట్లు చేసి విక్రయించారు. ఈ నక్షబాటను కాపాడాల్సిన అధికారులు మధ్య సమన్వయ లోపం రియల్టర్‌లకు కాసుల పంటపడ్డించింది. ఇప్పుడు ఎవరికి వారు చేతులెత్తేయడంతో తప్పు చేసిందెవరు..? అనకొండల్లా మిగింది ఎవరూ.. ? అనే ప్రశ్న తలెత్తుతుంది. రెండు గ్రామాలను కలిపే నక్షబాటను మధ్యలో దర్జాగా కబ్జా చేసిన ఆ భూ `మాయగాడె`వడో..! లోగుట్టు రెవెన్యూ అధికారులకు, రియల్ మాఫియాకే తెలియాలి..!
కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి..
నక్షబాటను కబ్జా చేసి దర్జాగా దందా చేసిన వ్యక్తులెవరో అధికారులు గుర్తించి వెంటనే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రియల్ వ్యాపారులు అదికారులను మచ్చిక చేసుకోవడంతోనే ఇంత దర్జాగా నక్షబాటను కబ్జా చేశారంటూ.. ప్రజలు ఆరోపిస్తున్నారు. నక్షబాటను సర్వే చేసి కాపాడి రియల్ వ్యాపారులపై చర్యలు తీసుకోకపోతే జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు ప్రత్యక్ష ఆందోళనలకు సిద్దమవుతామని స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు.






