చైతన్యపురిలో ఫుట్‌పాత్‌ల ఆక్రమణ.. ప్రజలకు అవస్థలు

by Malleboina Mahesh |

ప్రజా ప్రయోజనాల కోసం లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లు ఇప్పుడు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. చైతన్యపురి నుండి ఎల్బీనగర్ వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న నడక దారులు ఆక్రమణలకు గురికావడంతో సామాన్యులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రోడ్లపై నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

చైతన్యపురిలో ఫుట్‌పాత్‌ల ఆక్రమణ.. ప్రజలకు అవస్థలు
X

దిశ, చైతన్యపురి: ప్రజా ప్రయోజనాల కోసం జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ లు ఆక్రమణల చెరలో కొట్టుమిట్టాడుతున్నాయి. చోటా మోటా లీడర్ల కనుసన్నల్లో ఫుట్ పాత్‌లు, సర్వీస్ రోడ్లు ఆక్రమించుకొని వ్యాపారాలు కొనసాగిస్తున్నా వాటిని నిర్మూలించాల్సిన అధికారులు మిన్నకుండిపోయారు. తద్వారా పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు.

అసలు పరిస్థితి ఏమిటి?

చైతన్యపురి నుంచి ఎల్బీనగర్ వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా జీహెచ్ఎంసీ అధికారులు పాదచారులు నడవడానికి ప్రజాధనం లక్షలు వెచ్చించి ఫుట్ పాత్ లు నిర్మాణం చేశారు. ప్రజా అవసరాల కోసం ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ లు పూర్తిగా ఆక్రమణలకు గురైంది. చైతన్యపురి నుంచి ఎల్బీనగర్ వరకు రోడ్డుకు ఇరువైపులా ఖాళీగా ఫుట్ పాత్ లు కనబడవు. చిరు వ్యాపారాల పేరిట కొంతమంది చోటామోటా లీడర్లు మామూలు ప్రజలకు అనగా చిరు వ్యాపారం చేసుకోవాలనే ఆశ ఉన్నవారికి ఫుట్ పాత్ లు కిరాయికి ఇస్తున్నారంటే పరిస్థితి ఏమిటో అర్థం అవుతుంది. రోజు మాదిరిగా అద్దె రూపేణా వసూలు చేస్తున్నట్లు ప్రజలు బాహాటంగా చర్చించుకుంటున్నారు. ఇక్కడ సామాన్యుడే నష్టపోతున్నాడు.

ట్రాఫిక్ సమస్య అధికం..

చైతన్యపురి నుంచి విక్టోరియా మెట్రో స్టేషన్ వరకు ఫుట్ పాత్ లు ఆక్రమణకు గురి కావడం, పాదచారులు రోడ్లపై నడవడం, వాహనదారులు రోడ్లపై వాహనాలు నిలపడం మూలంగా రోడ్డు మధ్యలో నుంచి పాదచారులు నడుస్తుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డుపై ట్రాఫిక్ నియంత్రణ చేయాల్సిన ట్రాఫిక్ పోలీసులు కేవలం చాలాన్లు వేసేవరకు మాత్రమే పరిమితమవుతున్నారనే అపవాదు ఉంది. జీహెచ్ఎంసీ అధికారులు ట్రాఫిక్ పోలీసులు సమన్వయం చేసుకొని ఫుట్ పాత్ లు తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. మరి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.

Next Story