గురుకులంలో వికృత చేష్టలు.. టాయిలెట్ గోడలపై బూతు బొమ్మలు!

by Jakkula.Mamatha |

జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన బాలుర సంక్షేమ గురుకుల పాఠశాలలో వెలుగు చూసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

గురుకులంలో వికృత చేష్టలు.. టాయిలెట్ గోడలపై బూతు బొమ్మలు!
X

దిశ,మహాబూబాబాద్ ప్రతినిధి: జిల్లా కేంద్రంలోని తెలంగాణ గిరిజన బాలుర సంక్షేమ గురుకుల పాఠశాలలో వెలుగు చూసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వేసవి సెలవుల అనంతరం విద్యాసంస్థలు పునః ప్రారంభమైన నేపథ్యంలో టాయిలెట్ గోడలపై అశ్లీల చిత్రాలు, అసభ్యకరమైన రాతలతో పాటు పాఠశాల కిటికీ అద్దాలు పగలగొట్టడం, విద్యుత్ బోర్డులు ధ్వంసమైన ఘటనలు వెలుగులోకి రావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించాల్సిన విద్యాసంస్థలో ఇలాంటి వికృత చేష్టలు చోటుచేసుకోవడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

టాయిలెట్ గోడలను అసభ్యకర చిత్రాలు, రాతలతో నింపడం,పాఠశాల ఆస్తులను ధ్వంసం చేయడం వెనుక కేవలం ఆకతాయిల చర్యలేనా? లేక ఉద్దేశపూర్వకంగా చేసిన విధ్వంసమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకున్న ప్రిన్సిపాల్ వెంటనే స్పందించి టాయిలెట్ గోడలపై ఉన్న బూతు చిత్రాలు, అసభ్యకర రాతలను తొలగించే చర్యలు చేపట్టారు. ఘటనపై ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు తెలిసింది. ఈ వ్యవహారాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకుని అంతర్గత విచారణ ప్రారంభించినట్లు సమాచారం. బాధ్యులు ఎవరనే విషయంపై ఆరా తీస్తుండగా, విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story