- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మూడు పార్టీలు మారిన రేవంత్‌కు కిషన్ రెడ్డిని విమర్శించే అర్హత లేదు: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఫైర్.. కిషన్ రెడ్డిపై వ్యాఖ్యలకు ఘాటు కౌంటర్! పర్సంటేజీలు కాకుండా ప్రజా ప్రయోజనాలపై దృష్టి పెట్టాలని చురకలు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి (MLA Rakesh Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. రాబోయే జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పై సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి చౌకబారు విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్రంలో పరిపాలన చేతకాక, తమ వైఫల్యాలను, తప్పులను కప్పిపుచ్చుకోవడానికే కేంద్ర మంత్రిపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీలో పదవులను డబ్బులకు, అమ్మాయిలకు అమ్ముకుంటున్నారని స్వయంగా ఆ పార్టీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానించారని, ఆ నేతకు నోటీసులు ఇచ్చిన ఉదంతాన్ని ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన హోదాను మరచి మాట్లాడుతున్నారని, సీఎంగా ఉన్న వ్యక్తికి తన భాషపై కనీస పట్టు ఉండాలని హితవు పలికారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచందర్ రావుల వ్యక్తిత్వాన్ని విమర్శించే అర్హత మూడు పార్టీలు మారిన రేవంత్ రెడ్డికి లేదన్నారు. అవినీతితో కూడిన డీపీఆర్ (DPR) లకు కాకుండా, తెలంగాణ అభివృద్ధికి అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి తన వ్యక్తిగత పర్సంటేజీలపై కాకుండా, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలపై దృష్టి సారించాలని రాకేష్ రెడ్డి చురకలు అంటించారు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలకు కాలం చెల్లిందని, త్వరలోనే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గత పాలకులకు భిన్నంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే, రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుంచి బయటకు తీసుకువచ్చి దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెడతామని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి స్పష్టం చేశారు..






