- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళ ఐఏఎస్ ఉధంతంపై ఎన్‌టీవీ జర్నలిస్టుల అరెస్ట్
మహిళా ఐఏఎస్ అధికారిణి రాష్ట్ర మంత్రికి సంబంధించి వివాదాస్పద కథనాన్ని ప్రసారం చేసిన కేసులో ఎన్ టీవీ ఛానల్‌కి చెందిన ముగ్గురు జర్నలిస్టులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా ఐఏఎస్ అధికారిణి రాష్ట్ర మంత్రికి సంబంధించి వివాదాస్పద కథనాన్ని ప్రసారం చేసిన కేసులో ఎన్ టీవీ ఛానల్‌కి చెందిన ముగ్గురు జర్నలిస్టులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్ టీవీ ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు పరిపూర్ణ చారి, సుధీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. దొంతు రమేష్ తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్తుండగా, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ఇద్దరు రిపోర్టర్లను వారి వారి నివాసాలలో మంగళవారం రాత్రి అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది.
రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం కార్యదర్శి జయేష్ రంజన్ చేసిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు బీఎన్ఎస్, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ నేతృత్వంలో ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని డీజీపీ శివధర్ రెడ్డి ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. జర్నలిస్టుల అరెస్ట్ పై పోలీసుల చర్యలను బీఆర్ఎస్, బీజేపీ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీల నేతలు ఖండించారు.
ఎన్టీవీ కార్యాలయంలో సోదాలు..
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ లలోని ఎన్టీవీ కార్యాలయంలో పోలీసులు సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఎన్టీవీ కార్యాలయానికి చేరుకుని కంప్యూటర్లు, ఇతర సాంకేతిక పరికరాలను సర్వర్ రూమ్‌ను పరిశీలించారు. ఎటువంటి సెర్చ్ వారెంట్ లేకుండా పోలీసులు లోపలికి ప్రవేశించారని, , ఎడిటర్ రూం ఎక్కడని సిబ్బందిని బెదిరించారని ఎన్ టీవీ యాజమాన్యం ఆరోపించింది. వివాదంతో కార్యాలయం వద్ద కొంత సమయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. అనంతరం ఎన్టీవీ ఆఫీస్ నుంచి వెళ్లిపోయిన పోలీసులు మరోసారి వారెంట్ తో వచ్చి సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ప్రసారమైన వీడియోలు, డేటా నిక్షిప్తమై ఉండే సర్వర్ రూమ్‌ను కూడా పోలీసులు పరిశీలించారు. సమాచారం ఇవ్వకపోతే సర్వర్ రూమ్‌ను సీజ్ చేస్తామని కూడా సిబ్బందిని హెచ్చరించినట్లు తెలుస్తుంది. సోదాల అనంతరం హార్డ్ డిస్క్ , స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
సీసీఎస్‌లో ముగ్గురు జర్నలిస్టులను విచారించి అనంతరం ఒకరిని విడుదల చేశారు. దొంతు రమేష్, సుధీర్‌లను కింగ్ కోఠిలోని ప్రభుత్వ హస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం మెజిస్ట్రేట్ వద్దకు హజరుపరిచేందకు తరలించారు. లైంగిక వేధింపులు, స్టాకింగ్/వెంబడించడం, మహిళా గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించడం లేదా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడం, నేరపూరిత బెదిరింపులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం.
ఐటీ చట్టం ఎలక్ట్రానిక్ రూపంలో అశ్లీల సమాచారాన్ని ప్రసారం చేయడం వంటి ఐదు సెక్షన్ల పై కేసులు నమోదు చేశారు. సెక్షన్ల కింద అభియోగాలు రుజువైతే నేర స్వభావాన్ని బట్టి 3 నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది. ముఖ్యంగా మహిళా గౌరవానికి భంగం కలిగించే సెక్షన్లు తీవ్రమైనవిగా పరిగణించబడతాయని పోలీసులు పేర్కొన్నారు. జర్నలిస్టు సుధీర్‌ను రిమాండ్ తరలించే విషయంలో పోలీసుల ప్రవర్తించిన తీరుపై జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. క్రిమినల్ నేరస్థుడిగా పరిగణించే విధంగా మేడ పట్టుకుని తీసుకువెళ్ళారని , ఆ విధంగా తీసుకువెళ్లండం పై అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అరెస్టు సమయంలో ఇలా పోలీసులు ప్రవర్తన పై అసహనం వ్యక్తం చేశాయి.
సంబంధంలేని కేసులో ఇరికించారు: ఎన్టీవీ రిపోర్టర్లు రమేష్ ,సుదీర్
సంబంధంలేని కేసులో అక్రమంగా కేసులు పెట్టీ అక్రమ అరెస్టులు చేశారు. వారికి అనుకూలంగా రిమాండ్ రిపోర్ట్ రాసుకున్నారు. న్యాయ స్థానాల్లో మేము తేల్చుకుంటాం. అడ్డదిడ్డమైన ప్రశ్నలు అడిగారు. వారికి నచ్చినట్టు రాసుకుంటారు. న్యాయ స్థానాల్లో పోరాటం చేస్తాం.
ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనైతికం: కేంద్ర మంత్రి, కిషన్ రెడ్డి
ప్రజాస్వామ్యపు నాలుగో స్తంభమైన జర్నలిజం పట్ల, జర్నలిస్టుల పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అనైతికం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నమ్మకం లేదా? లేక కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారా?.. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన 8 మంది సభ్యుల స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ (సిట్ ) ఇంకా విచారణ జరుపుతూనే ఉంది. పోలీసులు దూకుడుగా వ్యవహరించి, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే జర్నలిస్టుల ఇళ్లపై దాడి చేసి, ఇంటి తలుపులు ధ్వంసం చేసి వారిని అరెస్టు చేయడం అత్యంత దురదృష్టకరం. విచారణ పూర్తయ్యాక, తప్పొప్పులు పరిశీలించి చర్యలు తీసుకోవాలి. ముందస్తు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్రమంగా అరెస్ట్ చేసిన జర్నలిస్టులను విడుదల చేయాలి. నిష్పక్షపాతంగా సిట్‌తో విచారణ జరిపించాలి. అంతే తప్ప జర్నలిస్టులను బెదిరించే, భయపెట్టే చర్యలకు పాల్పడకూడదని డిమాండ్ చేస్తున్నాం.
జర్నలిస్టుల అర్ధరాత్రి అరెస్టులు సరికాదు: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, జగ్గారెడ్డి
మంత్రులు ఉన్నతాధికారుల వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కథనాలు ప్రసారం చేయడం దురదృష్టకరం. ఆ పేరుతో జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంది. మంత్రులు మహిళా ఐఏఎస్ అధికారులపై ఆధారాలు లేకుండా కించపరిచే కథనాలు రావడంపై ఆగ్రహనికి గురి చేసింది. మంత్రులు, ఐఏఎస్ అధికారులు కావడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో వారి జీవితాలను ఇలా ప్రసారం చేయడం దుర్మార్గం. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారిపై ఇలాంటి వార్తలు వేయడం సమాజానికి మంచిది కాదు. ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి సీనియర్ అధికారి సజ్జన్నార్ నేతృత్వంలో సిట్ వేయడం జరిగింది.
సిట్ విచారణను స్వాగతిస్తున్నాం, కానీ అధికారులు అనుసరిస్తున్న తీరు సరిగా లేదు. అధికారులకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలి. కానీ పండుగ పూట సీనియర్ జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్టు చేసి తీసుకెళ్లడం వల్ల రాష్ట్రంలో జర్నలిస్టులు భయాందోళనకు గురవుతున్నారు. ఇది ప్రతిపక్షాలకు రాజకీయ అస్త్రం గా మారే అవకాశం ఉంది. సిట్ అధికారులు సంయమనంతో 'కూల్ మైండ్'తో వ్యవహరించి సమస్యను పరిష్కరించాలి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన సాగుతోంది: మాజీ మంత్రి కేటీఆర్
"మీ 'మొహబ్బత్ కీ దుకాన్' తెలంగాణ శాఖ పౌరుల రాజ్యాంగ హక్కులను ఏ విధంగా కాలరాస్తుందో రాహుల్ గాంధీ గమనిస్తున్నారా?. రేవంత్ రెడ్డి పాలనలో మీడియా డిజిటల్ మీడియాపై అణచివేత కొనసాగుతోంది. ఇది చీకటి రోజులను గుర్తు చేస్తోంది. తెలంగాణలో ముగ్గురు జర్నలిస్టులను అర్ధరాత్రి వేళ అత్యంత అమానవీయం. పండుగ పూట జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్టులను నేరస్థుల్లా చూడటం దురదృష్టకరం. పోలీసులు జర్నలిస్టుల ఇళ్ల తలుపులు పగులగొట్టి, వారిని అపహరించినట్లు తీసుకెళ్లడం దారుణం.
కేవలం బెయిలబుల్ సెక్షన్లు ఉన్న కేసులో నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాల్సింది పోయి, అర్ధరాత్రి వేళ వారి కుటుంబాలను భయభ్రాంతులకు గురిచేయడం పోలీసుల అతికి నిదర్శనం. రాష్ట్ర డీజీపీ చట్టపరమైన ప్రక్రియను అనుసరించాలి, కాంగ్రెస్ మురికి రాజకీయాల్లో భాగస్వాములు కావద్దు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలి. రాజ్యాంగబద్ధంగా మీడియాకు ఉన్న స్వేచ్ఛను హరించడం. ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు.
పాలన చేతగాని సర్కారు.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష్య సాధింపు చర్యలు : మాజీ మంత్రి హరీష్ రావు
పాలన చేతగాని సర్కారు పండగ పూట జర్నలిస్టులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగడం సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి.. ఇదేనా నీ ప్రజాపాలన.. ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ. మీడియా ప్రశ్నించడం మానేస్తే అధికారంలో ఉన్నవాళ్లు బరితెగిస్తారు. ప్రజల గొంతుక లేకుండా పోతోంది. జర్నలిస్టులను చూస్తే చెంప పగలగొట్టాలని అనిపిస్తోందని ఓసారి సీఎం రేవంత్ అన్నారు. ప్రశ్నించే హక్కు ఇస్తున్నామని చెప్పి. అధికారంలోకి వచ్చాక ఎమర్జెన్సీని తలపిస్తున్నారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
మీ రాజకీయ వికృత క్రీడల్లో తెలంగాణ ఉద్యమకారులైన జర్నలిస్టులను బలి చేస్తారా... ఇళ్లల్లో చొరబడి అర్ధరాత్రి వేళ అరెస్టులు చేయడానికి వాళ్లేమైన తీవ్రవాదులా.. ఇది ప్రజాస్వామ్యం పై రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న దాడి. తెలంగాణ జర్నలిస్టుల ఆత్మగౌరవం పై పని గట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రత్యక్ష దాడి. జర్నలిస్టుల అరెస్టులు, మీడియా- డిజిటల్ మీడియా పై సిట్ ఏర్పాటుతో ఎవర్ని కాపాడుతున్నారు? ఎవరిని వేటాడుతున్నారు.. మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్య హననానికి పాల్పడటం దుర్మార్గం.
జర్నలిస్టులపై అక్రమ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం : సీపీఐ నేత నారాయణ
విచారణ పూర్తి కాకుండానే, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి పూట జర్నలిస్టులను అరెస్ట్ చేయడం సరైన పద్ధతి కాదు. జర్నలిస్టులపై జరుగుతున్న ఇటువంటి దాడులు ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు. మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఏవైనా పొరపాట్లు జరిగితే సిట్ ద్వారా సమగ్ర విచారణ జరిపి, నిజానిజాలు నిర్ధారించిన తర్వాతే చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. అక్రమంగా అదుపులోకి తీసుకున్న ఎన్ టీవీ ఇన్ పుట్ ఎడిటర్ దొంతు రమేష్ తో పాటు ఇతర జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలి.
జర్నలిస్టులను నేరస్తులుగా చూడటం సరికాదు: సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం..
నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి జర్నలిస్టులను ఇళ్లపై దాడి చేసి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్టులను నేరస్తులుగా చూడటం సరికాదు. జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలి. రాష్ట్రంలో జర్నలిస్టులను అరెస్ట్ చేస్తున్నారన్న వార్త ఒక భయాందోళనకు గురి అవుతుంది. .
జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలి
టీయూడబ్ల్యూజే అధ్యక్షులు అల్లం నారాయణ, .ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్, టీఈఎంజేయూ అధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి, ఎ.రమణ కుమార్, ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యుడు అవ్వారి భాస్కర్ జర్నలిస్టులు గానీ, ఆ వార్త సంస్థ గాని నిరాధారమైన, అసత్య వార్త కథనాలు రాస్తే ఆ విషయంలో ఖండన కోరుకోవచ్చు. అప్పటికీ వారు స్పందించకపోతే చట్ట పరమైన చర్యలు తీసుకోవచ్చు. ఇలా అర్ధరాత్రి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వారిని అరెస్టు చేయడం సరైంది కాదు. ఈ ముగ్గురూ జర్నలిజంలో కొనసాగుతున్న సీనియర్ జర్నలిస్టులు. అరెస్టును తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది.
ఇదే సమయంలో జర్నలిస్టులకు సంఘం తరఫున ఒక సూచన కూడా చేస్తున్నాము. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారుల విషయంలో నిరాధారమైన వార్తలను ప్రసారం గాని, ప్రచురించవద్దని, ఆధారాలు ఉంటేనే వార్తలు వేయాలని, ముఖ్యంగా ఎవరి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వార్త కథనాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా మీడియా సంస్థలదే. ఏది ఏమైనా జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం అర్ధరాత్రి పూట తీవ్రవాదుల అరెస్టు చేయడం ఎంత మాత్రం సమంజసం కాదు. వెంటనే ప్రభుత్వం ఈ విషయంలో చొరవ తీసుకొని అరెస్టు చేసిన జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
నోటీసు లేకుండానే జర్నలిస్టుల అరెస్టులా: టీయూడ్ల్యూ ఎఫ్ కన్వీనర్, అడ్ హాక్ కమిటీ బీ బసవపున్నయ్య
ఎలాంటి నోటీసులు గానీ,, సెర్చ్ వారంట్ గానీ, విచారణ గానీ లేకుండా జర్నలిస్టుల ఇండ్లలోకి వెళ్ళి ముగ్గురు జర్నలిస్టులను అరెస్ట్ చేయడాన్నీ టీయూడ్ల్యూ ఎఫ్ ఖండిస్తున్నది. అర్ధరాత్రి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యేలా పోలీసులు వ్యవహరించిన తీరు గర్హనీయం. వర్కింగ్ జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నాం. వార్తల ప్రసారంలో అభ్యంతరం ఉంటే ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నా పట్టించుకోకుండా ఇస్టానుసారం వ్యవహరించడం భావ్యం కాదు. వార్తల ప్రచురణ, ప్రసారాలకు మీడియా యాజమాన్యాలే బాధ్యత వహించాలి.
అరెస్టులు మీడియా స్వేచ్ఛను హరించడమే: క్రాంతి కిరణ్ , సీనియర్ జర్నలిస్ట్, మాజీ ఎమ్మెల్యే
సీనియర్ జర్నలిస్ట్‌ల అరెస్టు మీడియా స్వేచ్ఛను హరించడమే. వీడియో స్వేచ్ఛగా రాయడానికివీల్లేదనే సంకేతాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ అరెస్టు ద్వారా చెప్పిన్నట్టు స్పష్టంగా అర్థం అవుతున్నది. ఒక పత్రికలో లేదా మీడియాలో ఒక అంశంపై కథనం వచ్చినప్పుడు వాటిలోని నిజానిజాలపై అధికారులు విచారణ జరిపించాల్సింది. కానీ ఒక అంశాన్ని బయటికి తీసుకొచ్చిన జర్నలిస్టులపై కేసులు పెట్టి వేధించడం కరెక్ట్ కాదు . కథనం తప్పయితే దాన్ని ఖండించాలి లేదా దానివల్ల ఎవరికైనా నష్టం జరిగి ఉంటే మీ కథనం వల్ల నాకు నష్టం జరిగింది అంటూ సదరు జర్నలిస్టులకు అలాగే యాజమాన్యం నుంచి సమాధానం రాబట్టాలి, లేదంటే కోర్టులో ఛాలెంజ్ చేసుకోవాలి.
కానీ ఏ వ్యక్తి ఫిర్యాదు లేకున్నా ఒక సంఘం ఫిర్యాదును ఆధారం చేసుకొని జర్నలిస్టులను అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఇది జర్నలిస్టుల స్వేచ్ఛను హరించడమే. జర్నలిస్టులో కూడా సంఘాలు ఉన్నాయన్న విషయాన్ని ప్రభుత్వం మర్చిపోవద్దు. జర్నలిస్టులను బాధ్యులుగా చేసి జైల్లో నిర్బంధిస్తామంటే ఏ జర్నలిస్టు కూడా ఊరుకోడు అనే విషయాన్ని ప్రభుత్వం గుర్తిస్తే బాగుంటుంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ కేసును ఎత్తివేసి వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను. ఎవరి మీద అయితే కథనం వచ్చిందో వారిని కూడా సజ్జనార్ నేతృత్వంలోని సిట్ అధికారులు విచారిస్తారా. వారిని కూడా విచారించి వారి ఫోన్లను సీజ్ చేసి వాస్తవాన్ని ప్రజలకు మీడియాకు తెలియ చెప్పాలి.
ఉద్యోగులను బాధ్యులను చేసి అరెస్టు చేయడం అన్యాయం : టీడబ్ల్యూజేఎఫ్, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య
ఎటువంటి విచారణ చేయకుండా, ముందస్తు నోటీసు ఇవ్వకుండా సిట్ పోలీసులు ముగ్గురు సీనియర్ జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) తీవ్రంగా ఖండించింది. మీడియాలో ప్రసారమయ్యే, ప్రచురితమయ్యే కథనాలకు ఆ సంస్థ ఎడిటర్, బోర్డు ఆఫ్ డైరెక్టర్లతో పాటు సంస్థ యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుంది. కానీ ఆ సంస్థలో పని చేసే జర్నలిస్టులను, ఇతర ఉద్యోగులను బాధ్యులను చేసి అరెస్టు చేయడం హేయమైన చర్య. తమది ప్రజా ప్రభుత్వం అని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...తన ప్రభుత్వంలోని అధికారులు అనుసరిస్తున్న విధానంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి. అక్రమ అరెస్టులు ఇతర జర్నలిస్టులను భయపెట్టేందుకు చేస్తున్న చర్యలు.






