ఏపీలో ఆగని 'ఎన్టీఆర్ వైద్య సేవ' బంద్.. రూ. 1,000 కోట్ల ఆఫర్ తిరస్కరించిన ఆస్పత్రులు!

by Malleboina Mahesh |

ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ కొనసాగింపు! రూ. 1000 కోట్ల ప్రతిపాదనను తిరస్కరించిన ఆస్పత్రులు. రూ. 3వేల కోట్ల బకాయిల కోసం పట్టుబట్టిన యాజమాన్యాలు.

ఏపీలో ఆగని ఎన్టీఆర్ వైద్య సేవ బంద్.. రూ. 1,000 కోట్ల ఆఫర్ తిరస్కరించిన ఆస్పత్రులు!
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉచిత వైద్య సేవలకు (Govt free medical services) సంబంధించి ప్రతిష్టంభన కొనసాగుతోంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన భారీ బకాయిల కోసం ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు చేపట్టిన 'ఎన్టీఆర్ వైద్య సేవ' బంద్ రెండో రోజు కొనసాగుతోంది. బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు కొత్త రోగులను చేర్చుకునేది లేదని స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ASHA) స్పష్టం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా పేద రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ నెట్‌వర్క్ ఆస్పత్రులకు ప్రభుత్వం సుమారు రూ. 3,000 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. గత కొన్నేళ్లుగా చెల్లింపులు సక్రమంగా జరగకపోవడంతో ఆస్పత్రుల నిర్వహణ భారంగా మారిందని యాజమాన్యాలు చెబుతున్నాయి.

కాగా ఈ బంద్‌ను విరమింపజేసేందుకు ప్రభుత్వం అత్యవసరంగా రూ. 1,000 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. అయితే, ఈ హామీపై హాస్పిటల్స్ అసోసియేషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మొత్తం రూ. 3,000 కోట్లలో కేవలం మూడో వంతు ఇచ్చి మమ్మల్ని సరిపెట్టమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. అలాగే బకాయిలు మొత్తం ఒకే విడతలో, కనీసం మెజార్టీ మొత్తాన్ని తక్షణమే విడుదల చేయాలని, భవిష్యత్తులో చెల్లింపుల కోసం ఒక నిర్దిష్ట గడువును (Timeline) ప్రకటించాలని ఆస్పత్రులు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఆస్పత్రుల్లో ఉన్న రోగులకు మాత్రమే చికిత్స అందిస్తున్నామని, కొత్తగా వచ్చే ఎన్టీఆర్ వైద్య సేవ కేస్‌లను అనుమతించడం లేదని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ప్రభుత్వం తదుపరి నిర్ణయంపైనే ఈ సేవల పునరుద్ధరణ ఆధారపడి ఉంది.

Next Story