వారం రోజుల్లో తొలగించాలన్న నోటీసు... ఎనిమిది నెలలైనా కదలని 127 విద్యుత్ స్థంభాలు..!

by Ratna Kumari |

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన 127 విద్యుత్ స్థంభాల వ్యవహారం రోజురోజుకూ కొత్త ప్రశ్నలకు దారితీస్తోంది.

వారం రోజుల్లో తొలగించాలన్న నోటీసు... ఎనిమిది నెలలైనా కదలని 127 విద్యుత్ స్థంభాలు..!
X

దిశ, లక్ష్మీదేవిపల్లి : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన 127 విద్యుత్ స్థంభాల వ్యవహారం రోజురోజుకూ కొత్త ప్రశ్నలకు దారితీస్తోంది. అటవీశాఖ వారం రోజుల్లో స్థంభాలను తొలగించాలని నోటీసులు జారీ చేసినప్పటికీ, ఎనిమిది నెలలు గడిచినా అవి యథాతథంగా ఉండటంపై ప్రజల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా రిజర్వ్ ఫారెస్ట్‌లో చిన్నపాటి పనికైనా అటవీశాఖ అనుమతి తప్పనిసరి కాగా, ఇంత పెద్ద ఎత్తున విద్యుత్ స్థంభాలు, లైన్లు ఎలా ఏర్పాటు చేశారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

127 స్థంభాలు... అధికారులకు కనిపించలేదా..?

విద్యుత్ స్థంభాల ఏర్పాటు ఒక్కరోజులో పూర్తయ్యే పని కాదు. భారీ వాహనాలు, క్రేన్లు, కార్మికులు, విద్యుత్ సామగ్రితో రోజుల తరబడి పనులు జరిగినా అటవీ, విద్యుత్, రెవెన్యూ శాఖలకు సమాచారం అందలేదా? ఒకవేళ తెలిసి ఉంటే ఎందుకు అడ్డుకోలేదనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఉన్నప్పటికీ ఇంత భారీ పని గుర్తించకపోవడం అధికార యంత్రాంగ వైఫల్యమా? లేక మరేదైనా కారణమా? అనే చర్చ సాగుతోంది.

రైతుల ఆశలు అడియాశలు..

సాగునీటి కోసం విద్యుత్ కనెక్షన్లు వస్తాయని నమ్మిన రైతులు బోర్లు వేయడం, మోటార్లు కొనుగోలు చేయడం, లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందని బాధితులు చెబుతున్నారు. కొందరి నుంచి డబ్బులు కూడా వసూలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అటవీ అనుమతుల సమస్యతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పంటలకు నీరు అందక రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. తప్పు చేసినవారు ఎవరైనా శిక్ష మాత్రం రైతులకే పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అటవీ చట్టాలు సామాన్యులకేనా..?

రిజర్వ్ ఫారెస్ట్‌లో చిన్నపాటి ఉల్లంఘన జరిగినా వెంటనే కేసులు నమోదు చేసే అధికారులు, 127 విద్యుత్ స్థంభాలు ఏర్పాటు అయ్యే వరకు ఎందుకు స్పందించలేదనే ప్రశ్న ప్రజల్లో వ్యక్తమవుతోంది. సామాన్యులపై కఠినంగా అమలయ్యే చట్టాలు ప్రభుత్వ శాఖలకు వర్తించవా అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

నోటీసుతో వెలుగులోకి వచ్చిన వ్యవహారం..

రిజర్వ్ ఫారెస్ట్‌లో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన విద్యుత్ స్థంభాలను తొలగించాలని అటవీశాఖ విద్యుత్ శాఖకు నోటీసు జారీ చేసిన తర్వాతే ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. చట్టబద్ధమైన అనుమతులు ఉంటే సమర్పించాలని, లేకుంటే స్థంభాలను తొలగించాలని నోటీసులో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

కొత్త డీఎఫ్‌వో ముందున్న తొలి పరీక్ష..

ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో)కు ఈ కేసు తొలి పరీక్షగా మారింది. నిజానిజాలు వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకుంటారా? రైతుల నుంచి డబ్బులు వసూలు చేసిన వారిని గుర్తిస్తారా? శాఖల మధ్య కుమ్మక్కు జరిగిందా అనే అంశాలను బయటపెడతారా? అనే ఆసక్తి నెలకొంది.

విచారణ కాదు... చర్యలు కావాలి..

ఈ ఘటనలో కేవలం కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుని అసలు బాధ్యులను వదిలేస్తే ప్రజల్లో ప్రభుత్వంపై మరింత అవిశ్వాసం పెరిగే ప్రమాదం ఉందని ప్రజాసంఘాలు పేర్కొంటున్నాయి. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అటవీ, విద్యుత్, రెవెన్యూ, విజిలెన్స్ శాఖలతో సంయుక్త విచారణ నిర్వహించి పూర్తి స్థాయిలో వాస్తవాలను వెలికితీయాలని డిమాండ్ చేస్తున్నాయి. రైతుల నుంచి డబ్బులు వసూలు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అధికారుల నిర్లక్ష్యం లేదా కుమ్మక్కు నిరూపితమైతే కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతులకు తక్షణ నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.

విద్యుత్ శాఖ వివరణ..

ఈ వ్యవహారంపై విద్యుత్ శాఖ డీఈను వివరణ కోరగా, రిజర్వ్ అటవీ భూమిలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్థంభాల తొలగింపునకు అటవీశాఖ ఇప్పటికే నోటీసులు జారీ చేసిందని తెలిపారు. స్థంభాల తొలగింపునకు అవసరమైన 'ఏ' ఫారాన్ని అటవీశాఖకు పంపించామని, అక్కడి నుంచి అనుమతులు వచ్చిన వెంటనే స్థంభాల తొలగింపు ప్రక్రియను చేపడతామని విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు.

Next Story