కాంగ్రెస్ హామీల్లో 20 శాతం కూడా అమలు కాలేదు

by Ratna Kumari |

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 420 హామీలు, గ్యారంటీలు ఇచ్చినా, రెండున్నరేళ్ల పాలనలో 20 శాతం హామీలను కూడా అమలు చేయలేదని జనసేన ఉమ్మడి ఖమ్మం జిల్లా కో-ఆర్డినేటర్ గడల శ్రీనివాసరావు విమర్శించారు.

కాంగ్రెస్ హామీల్లో 20 శాతం కూడా అమలు కాలేదు
X

దిశ, కొత్తగూడెం ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి 420 హామీలు, గ్యారంటీలు ఇచ్చినా, రెండున్నరేళ్ల పాలనలో 20 శాతం హామీలను కూడా అమలు చేయలేదని జనసేన ఉమ్మడి ఖమ్మం జిల్లా కో-ఆర్డినేటర్ గడల శ్రీనివాసరావు విమర్శించారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు, విద్యార్థులు, యువత, నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఎల్‌నినో ప్రభావంతో ఉమ్మడి జిల్లాలో ఎన్నడూ లేని విధంగా భూములు బీడుగా మారుతున్నాయని, ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు సరైన అవగాహన కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు.

యాప్ ద్వారా యూరియా పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, రైతులకు ఆ విధానంపై తగిన అవగాహన లేదని అన్నారు. తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు, ఏటా రెండు లక్షల ఉద్యోగాలు వంటి హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థుల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయని, కాలేజీలు సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. వైరల్ జ్వరాల ముప్పు ఉన్నప్పటికీ జిల్లా మంత్రులు ప్రజారోగ్యంపై దృష్టి పెట్టడం లేదని, సమీక్షలు నిర్వహించి కార్యాచరణ రూపొందించడంలో విఫలమయ్యారని విమర్శించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించే పరిస్థితి ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల నాటికైనా కనీసం 50 శాతం హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ కాంగ్రెస్‌కు 'బీ' టీమ్..

బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 'బీ' టీమ్‌గా వ్యవహరిస్తోందని గడల శ్రీనివాసరావు ఆరోపించారు. జిల్లాలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి వాటిని పక్కదారి పట్టిస్తున్నాయని విమర్శించారు. గత పదేళ్లలో జిల్లాకు ఒక్క కొత్త పరిశ్రమ కూడా తీసుకురాలేదని, కేటీపీఎస్ రెండో దశ ప్లాంట్‌ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై మేధావులు, విద్యావంతులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి, కేటీపీఎస్ రెండో దశ కోసం ఉద్యమానికి శ్రీకారం చుడతామని తెలిపారు. పోడు భూముల సమస్య ఇప్పటికీ పరిష్కారం కాలేదని, ఇకపై ఆ సమస్య పరిష్కార బాధ్యతను జనసేన తీసుకుంటుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పేపర్ లీకులు జరిగినప్పుడు కేసీఆర్, కేటీఆర్ లేదా అప్పటి మంత్రులు రాజీనామా చేశారా అని ప్రశ్నించిన ఆయన, ఇప్పుడు ఉద్యమాల పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని ఎద్దేవా చేశారు.

స్థానిక ఎన్నికల్లో జనసేన పోటీ..

రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని గడల శ్రీనివాసరావు ప్రకటించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా జనసేనను బలోపేతం చేసే దిశగా అన్ని నియోజకవర్గాల్లో కార్యాచరణ కొనసాగుతోందని చెప్పారు. సెప్టెంబర్ మొదటి వారంలో ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆగస్టు 2న దమ్మపేటలో నిర్వహించే పార్టీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో మిరియాల రామకృష్ణ, రాము యాదవ్, మౌనికతో పాటు జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Next Story