మరో వైరస్ కలకలం.. క్రూయిజ్ లో 1700 మంది క్వారంటైన్.. 50 కి లక్షణాలు

by Muthe.Rajitha |

ఓవైపు హంటా వైరస్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తుండగా.. మరోకొత్త వైరస్ కలకలం రేగింది.

మరో వైరస్ కలకలం.. క్రూయిజ్ లో 1700 మంది క్వారంటైన్.. 50 కి లక్షణాలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఓవైపు హంటా వైరస్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తుండగా.. మరోకొత్త వైరస్ కలకలం రేగింది. ఇలా క్రూజ్‌ నౌకల్లో వరుస వైరస్‌ల వ్యాప్తి వరుస ఘటనలు ప్రయాణికులను వణికిపోయేలా చేస్తున్నాయి. ఇటీవల 'ఎంవీ హొండియస్‌' నౌకలో హంటా వైరస్‌ కారణంగా ముగ్గురు మరణించిన ఘటన మరువక ముందే, ఇప్పుడు మరో నౌకలో నోరోవైరస్‌ (Norovirus) సంచలనం సృష్టిస్తోంది. ఉత్తర ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్‌ నుండి స్పెయిన్‌కు ప్రయాణిస్తున్న 'యాంబిషన్‌' అనే క్రూజ్‌ నౌకలో నోరోవైరస్‌ లక్షణాలతో 90 ఏళ్ల వృద్ధుడు మృతి చెందడంతో ఈ వైరస్ ఉనికిలోకి వచ్చింది. వెంటనే ఫ్రాన్స్‌లోని బోర్డెక్స్‌లో నౌకను నిలిపివేసి, అందులోని సుమారు 1,700 మంది ప్రయాణికులను, సిబ్బందిని క్వారంటైన్ చేశారు. అయితే ఇప్పటికే మరో 50 మందిలో ఈ వైరస్‌ లక్షణాలు బయటపడినట్లు అధికారులు ధృవీకరించారు.

అలాగే హంటా వైరస్‌కు, ప్రస్తుత నోరోవైరస్‌ వ్యాప్తికి ఎలాంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. నోరోవైరస్‌ ను సాధారణంగా 'వామిటింగ్‌ బగ్‌' అని పిలుస్తారు. అమెరికన్‌ సీడీసీ సమాచారం ప్రకారం.. ఇది కలుషిత ఆహారం, నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. అన్ని వయసుల వారికి సోకే ఈ వైరస్ వల్ల విరేచనాలు, వాంతులు, కడుపునొప్పి, వికారం, జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే మరణం సంభవించే అవకాశం ఉంటుంది. కాగా కొత్త కొత్త వైరస్ లు పుట్టుకొస్తుండగా.. విదేశీ ప్రయాణాలు, టూర్లు అంటేనే పర్యాటకులు వణికిపోతున్నారు.

Next Story