- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్లో నామినేటెడ్ జోష్!
ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నామినేటెడ్ పదవి పద్ధతిలో భర్తీ చేస్తామని ప్రకటించడంతో నేతల్లో జోష్ కనిపిస్తుంది.

దిశ, వరంగల్ బ్యూరో: ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలకు ఇక పదవులు రానున్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు నామినేటెడ్ పదవి పద్ధతిలో భర్తీ చేస్తామని ప్రకటించడంతో నేతల్లో జోష్ కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ కీలక నేతలకు సహకార సంఘాల్లో నామినేటెడ్ పద్ధతుల్లో చైర్మన్ స్థానాలు దక్కనున్నాయి. గ్రామ స్థాయి నేతలకు డైరెక్టర్ పదవులు రానున్నాయి. ఎన్నికలు లేకుండా, ఎలాంటి పైసా ఖర్చు లేకుండా నామినేటెడ్ పద్ధతిలో అన్ని పదవులు పార్టీ నేతలనే వరించనున్నాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నేతలు సిఫారసు చేసిన వారికే కీలక పదవులు దక్కనుండటంతో జోరుగా కాంగ్రెస్ నేతలు పైరవీలు చేస్తున్నారు.
సహకార సంఘాలకు నామినేటెడ్ పద్ధతిలో..
రాష్ట్ర స్థాయి లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు లేకుండా నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్లు, డైరెక్టర్లను నియమించేందుకు రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. క్యాబినెట్ నిర్ణయాలకు అనుగుణంగా సహకార చట్టం లోని నిబంధనలు మార్చనున్నారు. సహకార శాఖ ఆధ్వర్యంలో వీటిని భర్తీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 98 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 1,260 డైరెక్టర్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో సభ్యత్వం ఉన్న రైతులు ఈ ఎన్నికల్లో ఓటు వేసేవారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో డైరెక్టర్లను ఎన్నుకునేవారు. ఆ డైరెక్టర్లలో ఒకరిని చైర్మన్ గా నియమించే వారు. చట్టం ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే ఐదేళ్ల పాటు పదవిలో ఉండే వారు. సహకార సంఘాల పదవీకాలం గత సంవత్సరం ఫిబ్రవరి 14న ముగిసింది. ప్రస్తుతం కొత్త సంఘాలను ఏర్పాటు చేయలేదు. హన్మకొండ జిల్లా పరిధిలో 12, వరంగల్ 31, జనగామ 14, మహబూబాబాద్ 19, భూపాలపల్లి 10, ములుగు 12 సంఘాలు ఉన్నాయి. ఒక్కోక్కదాని పరిధిలో 13 డైరెక్టర్లు ఉన్నారు. ఇవే కాకుండా ఉమ్మడి జిల్లా పరిధిలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, డీసీఎంఎస్ లు ఉన్నాయి. వీటిని కూడా ఎన్నికల ద్వారానే చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లను ఎన్నుకునే వారు. ప్రస్తుతం ఎన్నికలను కాకుండా నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్, డైరెక్టర్లను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది.
కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం..
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, డీసీఎంఎస్ లకు నామినేటెడ్ పద్ధతిలో పదవులను భర్తీ చేయనుండటంతో కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం కనబడుతుంది. ఉమ్మడి జిల్లా పరిధిలో పోటీ లేకుండా నామినేటెడ్ పద్ధతిలో ఎంపిక జరుగనుండటంతో చైర్మన్లు, డైరెక్టర్లు అన్నీ వారినే వరించనున్నాయి. ఆరు జిల్లాల పరిధిలో కీలకంగా ఉన్న ఈ పదవులు అన్ని మండలాల సీనియర్ నేతలను వరించనున్నాయి. రిజర్వేషన్లను బట్టి ఈ పదవులను ఎంపిక చేయనున్నారు. సహకార సొసైటీలకు నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్, డైరెక్టర్లను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకోవడంతో ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే మాటలే చెలామణి కానుంది. వారికి దగ్గరగా ఉన్న నేతలకే ఈ పదవులు ఎక్కువగా రానున్నాయి. కొన్ని పదవులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు సిఫార్సులు చేసిన మెజార్టీ పదవులు వారికే దక్కనున్నాయి. ఉమ్మడి జిల్లా మంత్రులతో పాటు నేతలు కీలకంగా వ్యవహరించనున్నారు. పదేళ్ల పాటు పార్టీ కోసం పనిచేసిన వారిని కూడా నామినేటెడ్ పద్ధతిలో కీలక చైర్మన్ పదవులు దక్కనున్నాయి. ఇప్పటి వరకు పదవులు రాని వారు ప్రభుత్వ నిర్ణయంతో వీటిపైన ఫోకస్ పెడుతున్నారు. చైర్మన్ పదవులపై దృష్టి పెట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా ధాన్యం సేకరణ వల్ల చాలా సొసైటీలకు డబ్బులు వస్తున్నాయి.
ఆదాయం కూడా భారీగా ఉంటుంది. అదనపు ఆదాయం ఉంది. సొసైటీల్లో నిధులు ఉండటం చైర్మన్లకు కలిసి వస్తుంది. ఎన్నికలు నిర్వహిస్తే భారీగా ఖర్చు పెట్టి ఎంపిక కావాల్సి ఉంటుంది. ఎలాంటి ఖర్చు లేకుండా ప్రభుత్వం నామినేటెడ్ పద్ధతిలో భర్తీకి నిర్ణయం తీసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ నేతలకు కలిసి వస్తుంది. ప్రభుత్వం ఈ సొసైటీ చైర్మన్ల భర్తీకి త్వరలోనే జీవో జారీ చేయనుండటంతో ముందస్తుగానే చాలా మంది నేతలు ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రాథమిక వ్యవసాయ సంఘాల చైర్మన్లతో పాటు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుపై సీనియర్ నేతలు దృష్టి పెట్టారు. ఈ బ్యాంకు కీలకం కావడం వందల కోట్ల నిధులు ఉండటంతో చైర్మన్ పదవి వస్తే లాభించే అవకాశం ఉండటంతో నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో తమకున్న పరిచయాల ఆధారంగా ప్రయత్నాలు చేస్తున్నారు.






