ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు చేరవేస్తా

by Ratna Kumari |

ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.. ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు చేరవేస్తా
X

దిశ, కారేపల్లి/కామేపల్లి : ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్, రహదారులు, తాగునీరు వంటి మౌలిక వసతులను మరింత బలోపేతం చేసి అభివృద్ధి ఫలాలను ప్రతి గ్రామానికి చేరవేస్తామని తెలిపారు. ఆదివారం కామేపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన సుమారు రూ.11.80 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ముందుగా అడవి మద్దులపల్లి గ్రామంలో రూ.2.85 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ ఉపకేంద్రం అందుబాటులోకి వస్తే పరిసర గ్రామాలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని తెలిపారు. అనంతరం రూ.3.95 కోట్ల వ్యయంతో తాళ్లగూడెం నుంచి నర్సయ్యకుంట వరకు (ఎంపీపీఎస్ పాఠశాల మీదుగా) నిర్మించనున్న బీటీ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.5 కోట్ల వ్యయంతో ఇల్లందు ఆర్‌అండ్‌బీ రహదారి నుంచి కామేపల్లి స్మశానవాటిక వరకు పెద్ద చెరువు మీదుగా నిర్మించనున్న బీటీ రహదారి పనులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఈ పనులు పూర్తయితే రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు గ్రామీణాభివృద్ధికి మరింత వేగం చేకూరుతుందని అన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇస్తోందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, టీజీఎన్‌పీడీసీఎల్ ఎండీ వరుణ్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, రాందాస్ నాయక్, సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, టీజీఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్ వి. మోహన్ రావు, సీఈ రాజు చౌహాన్, ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి, పీఆర్ ఎస్‌ఈ జి. వెంకట్ రెడ్డి, ఈఈ మహేష్ బాబు, కామేపల్లి తహసీల్దార్ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story