- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నామినేటెడ్ పోరు.. నేతల జోరు!
రాష్ట్రంలో సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పదవుల కోసం ఆశావాహుల వేట ముమ్మరమైంది.

దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో: రాష్ట్రంలో సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పదవుల కోసం ఆశావాహుల వేట ముమ్మరమైంది. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా జెండా మోసిన పాత కాంగ్రెస్ నాయకులతో పాటు, ఇటీవల ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన బలమైన నేతలు, కార్యకర్తలు సైతం పదవుల కోసం ప్రాకులాట మొదలుపెట్టారు. ఎలాగైనా సరే తమకు అనుకూలమైన పదవులను దక్కించుకోవాలని, స్థానిక శాసనసభ్యుల ఆశీస్సుల కోసం నియోజకవర్గ కేంద్రాల్లో ముమ్మర యత్నాలు సాగిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేల నివాసాలు, క్యాంపు కార్యాలయాలు ఆశావాహుల తాకిడితో కిటకిటలాడుతున్నాయి.
ఎన్నికల్లేవు.. అంతా నామినేటెడే!
సింగిల్ విండో పాలకమండలి సభ్యుల ఎంపిక ప్రక్రియలో ఈసారి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో మాదిరిగా ఎన్నికల జోలికి వెళ్లకుండా, ఈసారి నామినేటెడ్ పద్ధతిలోనే సభ్యులను ఎంపిక చేయాలని అధికార పక్షం భావిస్తోంది. ఇందులో భాగంగా అర్హులైన నాయకుల జాబితాను సిద్ధం చేసి పంపాలని ఎమ్మెల్యేలకు ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు అందినట్లు సమాచారం. ప్రతి సింగిల్ విండో పరిధిలో 13 మంది సభ్యులను ఎమ్మెల్యేలు ఎంపిక చేసి అధిష్టానానికి పంపుతారు.
ఆ తర్వాత ఎమ్మెల్యేల సలహాలు, సూచనల మేరకే వచ్చిన వారి నుంచి చైర్మన్, వైస్ చైర్మన్లను ఖరారు చేయనున్నారు. అయితే, ఎన్నికల ద్వారా కాకుండా కేవలం నామినేటెడ్ పద్ధతిలోనే ఈ కార్యాలయాలను భర్తీ చేస్తే భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉందని అధికార పార్టీకి చెందిన కొందరు సీనియర్ నేతలే అంతర్గతంగా అభిప్రాయపడుతుండటం గమనార్హం. అయినప్పటికీ, తమకు ఏదో ఒక రకంగా అవకాశం కల్పించాలని ద్వితీయ శ్రేణి నాయకులు ఎమ్మెల్యేలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.
ఇంకా తేలని కో-ఆప్షన్ సభ్యులు..
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటీవల మున్సిపల్ ఎన్నికల అనంతరం కొన్ని మున్సిపాలిటీల్లో కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ పూర్తయినప్పటికీ, మరికొన్ని చోట్ల ఇంకా ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. స్థానిక రాజకీయ సమీకరణాలు, వర్గపోరు నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నిర్ణయం ఎప్పటికప్పుడు వాయిదా పడుతుండటంతో ఆశావహుల సంఖ్య రోజురోజుకూ రెట్టింపవుతోంది. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని కో-ఆప్షన్ సభ్యుల ఎంపికను త్వరితగతిన పూర్తి చేయాలని కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ముడా పీఠం ఎవరికి?
మహబూబ్‌నగర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) పాలకమండలి కాలపరిమితి కూడా త్వరలోనే ముగియనుండటంతో, తదుపరి చైర్మన్ పీఠం ఎవరిని వరించనుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ముడా పరిధిలోకి మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాలు వస్తాయి.తమకు అవకాశం కల్పించాలని పలువురు ఆశావహులు క్యూలో ఉన్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒక నియోజకవర్గానికి చైర్మన్ పదవి ఇవ్వాలని గతంలో ఎమ్మెల్యేలు ఒక ఒప్పందానికి వచ్చారు. ఇందులో భాగంగా తొలి విడతలో మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి చెందిన లక్ష్మణ్ యాదవ్‌కు అవకాశం ఇచ్చారు.
అయితే అప్పట్లో డైరెక్టర్ల పదవులను భర్తీ చేయలేదు. ప్రస్తుతం రెండో విడత కింద జడ్చర్ల లేదా దేవరకద్ర నియోజకవర్గాలకు చెందిన పలువురు నాయకులకు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అప్పట్లోనే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో, మళ్లీ మహబూబ్‌నగర్ వాసులకే ఇస్తారా? లేక ఒప్పందం ప్రకారం జడ్చర్ల, దేవరకద్రల్లో ఒకరికి అవకాశం దక్కుతుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈసారి చైర్మన్‌తో పాటు పూర్తిస్థాయిలో డైరెక్టర్లను కూడా నియమిస్తే పెద్ద సంఖ్యలో ఉన్న ఆశావహులకు న్యాయం జరుగుతుందని, అధిష్టానం తమ వైపు మొగ్గు చూపుతుందని కార్యకర్తలు ఆశగా ఎదురుచూస్తున్నారు.






