SIR పై ఫోకస్.. స్థానిక ఎన్నికలకు నో ఛాన్స్!

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-05-18 05:14:28  IST  )

ఓటరు జాబితా సమగ్ర సవరణ పూర్తయ్యే వరకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదు.

SIR పై ఫోకస్.. స్థానిక ఎన్నికలకు నో ఛాన్స్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) పూర్తయ్యే వరకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం కనిపించడం లేదు. ఎన్నికల సంఘం అధికారులు, సిబ్బంది, రాజకీయ పార్టీల ప్రతినిధులు అంతా ప్రస్తుతం ఎస్‌ఐఆర్‌పైనే దృష్టి సారించారు. ఎన్నికలు నిర్వహించాలంటే తాజా ఓటరు జాబితా అవసరం. ప్రస్తుతం ఎస్ఐఆర్ ప్రక్రియ​జరుగుతున్నందున ఓటరు జాబితా సైతం అక్టోబరు 1వ తేదీ వరకు అందుబాటులో ఉండే అవకాశం లేదని తెలుస్తున్నది. రాష్ట్రంలో జూన్​ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటికీ తిరుగుతూ బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వో)లు ఎస్ఐఆర్ కోసం ఎన్యుమరేషన్​ఫామ్స్ అందించనున్నారు. ఆ తర్వాత ముసాయిదా ప్రకటన, అభ్యంతరాలు స్వీకరణ, నోటీసులు అందించడం.. చిట్టచివరగా అక్టోబరు 1న తుది ఓటరు జాబితాను ప్రకటించనున్నారు. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్​మున్సిపల్ కార్పొరేషన్‌లతో పాటుగా వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు సహా ఇతర వాటికి ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించడం కష్టమేనని రాష్ట్ర ఎన్నికల అధికారులు చెబుతున్నారు.

క్షేత్రస్థాయిలో అధికారులు ‘ఎస్ఐఆర్’పై బిజీ

ఎస్ఐఆర్‌పై ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. దాన్ని అమలు చేయడానికి రాష్ట్రంలో ఎన్నికల అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సర్‌ను క్షేత్ర స్థాయిలో నిర్వహించేది కలెక్టర్‌లు, ఆర్డీవోలు, ఎమ్మార్వోలు, గ్రామ పంచాయతీల కార్యదర్శులు, రెవెన్యూ, పంచాయతీరాజ్​ సిబ్బందే. స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేంది, పర్యవేక్షించేది కూడా వీరే. దీంతో రెండు పనులను ఒకేసారి నిర్వహించడం సాధ్యం కాదు. అధికార యంత్రాంగం అందుబాటులో లేనందున స్థానిక సంస్థల ఎన్నికలను ఇప్పట్లో నిర్వహించడం కష్టంతో కూడుకున్న పని అని రాష్ట్ర ఎన్నికల అధికారులు స్పష్టంచేస్తున్నారు.

రాజకీయపార్టీలు సైతం..

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్‌పై జరిగిన రాద్ధాంతం, ఓట్ల తొలగింపు నేపథ్యంలో తెలంగాణలోని రాజకీయ పార్టీలు ‘సర్’​ను చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. ప్రతి పోలింగ్​ బూత్‌కు ఒక బీఎల్‌ఏను నియమిస్తున్నాయి. ఓటరు జాబితా ప్రక్షాళన అనేది పార్టీల గెలుపొటముల్లో కీలక పాత్ర పోషించనున్నది. అందుకే సమావేశాలు, సమీక్షలను నిర్వహిస్తున్నారు. స్థానిక నాయకులకు రాజకీయ పార్టీలు సూచనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు, సిబ్బందితో పాటుగా రాజకీయ పార్టీలు సైతం ‘సర్’​లో నిమగ్నమైనందున స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పార్టీలు ఆసక్తి చూపకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఇదే టైంలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముందుపెట్టుకున్నది. ఒకవైపు ఎస్ఐఆర్, మరోవైపు సభ్యత్వ నమోదులో గులాబీ నేతలు నిమగ్నమయ్యారు. మరోవైపు ఓటరు జాబితా ప్రక్షాళన తరువాత ఎన్నికలు నిర్వహిస్తే ఓరిజినల్‌గా మిగిలే ఓటర్లు ఓటింగ్‌లో పాల్గొంటారు. అందుకే మరో 3 లేదా 4 నెలల తర్వాతే ఎన్నికలు నిర్వహించాలనే సూచనలు వస్తున్నాయి. ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికల నిర్వహణ సాధ్యంకాదని చెప్పడం, రాజకీయ పార్టీలు సైతం ‘సర్’​పై దృష్టి పెట్టడంతో వచ్చే దసరా వరకు ఎన్నికలు ఉండే అవకాశం లేదని చర్చ జరుగుతున్నది.

ఈ ఓటరు జాబితానే ఫైనల్..

సర్‌ ప్రక్రియ ద్వారా ఒకరికి రెండు, మూడు ఓట్లు ఉంటే వాటిని తొలగించనున్నారు. చనిపోయిన వారి పేర్లు, ఇతర ప్రాంతాల్లో ఓటు కలిగి ఉన్న వారి పేర్లను సైతం తొలగించి ప్రక్షాళన చేసే అవకాశం ఉంది. ఇదే జాబితాతో వచ్చే స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే చాన్స్ ఉంటుంది. ఓటరు జాబితా ప్రక్షాళన తరువాత పెండింగ్‌లో ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, హైదరాబాద్​సహా ఇతర కార్పొరేషన్‌ల ఎన్నికలు నిర్వహిస్తే రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలన్నీ కవర్ అవుతాయి. రాష్ట్ర రాజకీయాల్లో స్థానిక ఎన్నికల ఫలితాలు సెమీ ఫైనల్ తరహాలో ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఫలితాల ద్వారానే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను అంచనా వేయవచ్చని చెబుతున్నారు. స్థానిక ఎన్నికలు అధికార పార్టీకి కొంతవరకు అనుకూలంగా ఉన్నా.. ఎంతమేర అనుకూలంగా ఉన్నాయి? ఏ ప్రాంతంలో ఎలా రిజల్ట్స్ వచ్చాయి? అని ఈ ఎన్నికల ద్వారా రాజకీయ పార్టీలు విశ్లేషణ చేసుకునే చాన్స్ ఉందని తెలుస్తోంది. జనరల్ ఎలక్షన్స్‌కు రెండేండ్ల ముందు స్థానిక ఎన్నికలు జరుగుతుండటంతో ఫలితాల ఆధారంగా లోటుపాట్లను పార్టీలు సరిచేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

నామినేటెడ్ పోరు.. నేతల జోరు!

Next Story