- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్లారెడ్డిలో జాడలేని ఫాగింగ్
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో ఫాగింగ్ కార్యక్రమం చేపట్టకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో ఫాగింగ్ కార్యక్రమం చేపట్టకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా దోమలు కుడుతుండటంతో విషజ్వరాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, సిబ్బంది అలసత్వం కారణంగా దోమల నివారణ చర్యలు పూర్తిగా నిలిచిపోయాయని ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలతో పాటు పట్టణంలోని ప్రధాన రహదారులు, వివిధ వార్డుల్లో మురికి కాలువల్లో నీరు నిల్వ ఉండటంతో దోమలు విస్తరిస్తున్నాయని పేర్కొంటున్నారు.
చాలా రోజులుగా ఫాగింగ్ నిర్వహించకపోవడంతో సాయంత్రం వేళల్లో దోమల బెడద మరింత ఎక్కువవుతోందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దోమల నివారణ చర్యలు లేకపోవడం వల్ల విషజ్వరాల కేసులు పెరుగుతున్నాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మురికి కాలువల్లో చెత్తాచెదారం పేరుకుపోవడం, మురుగునీరు నిల్వ ఉండటం వల్ల దుర్వాసన వెదజల్లుతోందని, ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో పారిశుధ్య పరిస్థితులు మరింత దిగజారాయని స్థానికులు ఆరోపించారు. పట్టణంతో పాటు విలీన గ్రామాల్లో మురికి కాలువలను వెంటనే శుభ్రం చేసి, ఫాగింగ్ నిర్వహించి దోమల నివారణ చర్యలు చేపట్టి ప్రజలను విషజ్వరాల బారిన పడకుండా కాపాడాలని స్థానికులు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.






