- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.. 15 ఏళ్లుగా భూమి కోసం వృద్ధుడి పోరాటం
ఇతరుల కబ్జాలో ఉన్న తమ భూములను తిరిగి దక్కించుకునేందుకు అలుపెరుగని పోరాటం చేస్తున్న బాధితులకు ఏళ్లు గడుస్తున్నా న్యాయం దక్కడం లేదు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఇతరుల కబ్జాలో ఉన్న తమ భూములను తిరిగి దక్కించుకునేందుకు అలుపెరుగని పోరాటం చేస్తున్న బాధితులకు ఏళ్లు గడుస్తున్నా న్యాయం దక్కడం లేదు. రెవెన్యూ కార్యాలయాలు, అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్న, న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు. కోర్టు గడప తొక్కుతున్నారు. అయినా తమకు న్యాయం దక్కడం లేదని బాధితులు వాపోతున్నారు. గతంలో అంతగా విలువ లేని భూముల మార్కెట్ విలువ అమాంతం పెరిగిపోవడంతో భూకబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయి. నలుగురి సమక్షంలో పరిష్కారమయ్యే భూపంచాయితీలు కూడా జఠిలంగా మారి ఎటూ తేలని భూసమస్యలు గా మారిపోయాయి. చాలా మంది బాధితుల్లో అక్రమ కబ్జా దారుల కారణంగా తమ భూమి చేజారిపోయిందన్న దిగులుతో ఇప్పటికే కొందరు కన్ను మూశారు. మరి కొందరు వయసు పైబడి అధికారుల చుట్టూ తిరగలేక అవస్థలు పడుతున్నారు. ప్రతి సోమవారం నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్‌లో జరిగే ప్రజావాణి కార్యక్రమానికి తరలివస్తున్నారు. కలెక్టర్ కు తమ గోడును వెల్లబోసుకునేందుకు ఎంతో ఆశతో వస్తున్నారు. దరఖాస్తు ఇచ్చి వెళుతున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో భూసమస్యలు..
ఉమ్మడి జిల్లాలో దాదాపు 5 వేల నుంచి 7 వేల ఎకరాల విస్తీర్ణంలో భూ సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు అనధికారిక అంచనా. వీటిలో 80 శాతానికి పైగా అసైన్మెంట్ భూముల వివాదాలే ఉన్నాయి. గతంలో ఈ భూముల పంచాయితీ కారణంగా పలువురు దారుణ హత్యలకు గురైన సందర్భాలున్నాయి. మరి కొందరిపై భౌతిక దాడులు జరగగా తీవ్ర స్థాయిలో గాయపడి నెలల తరబడి ఆస్పత్రుల్లో చికిత్స పొందిన కేసులు కూడా ఉన్నాయి. ఇలాంటి కేసులు కూడా ఇప్పటికీ పరిష్కారం కాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. భూ సమస్యల పరిష్కారం కోసం ఎదిరి చూస్తున్న బాధితులు ఎంతటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారో, వాటి పరిష్కారానికి అధికారులు చూపాల్సిన చొరవ చూపకుండా ఎంత లైట్ తీసుకుంటున్నారనే విషయం చెప్పకనే చెపుతోంది.
82 ఏళ్ల వృద్ధుడు.. 15 ఏళ్లుగా భూమి కోసం పోరాటం..
నిజామాబాద్ రూరల్ మండలం కాలూరు కు చెందిన జిన్న లింగరెడ్డి అనే ఓ 82 ఏళ్ల వృద్ధుడు తన పేరు, భార్య పేరు మీదున్న 5 ఎకరాలకు పైగా భూమి ఆక్రమణకు గురి కాగా, న్యాయం కోసం దాదాపు 15 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికీ ఆయన భూములకు సంబంధించిన అన్ని పత్రాలను, ఏళ్ల నుండి భూమి తనదే అని నిరూపించే పహణీ నకళ్లను, 1 బిల్లును అన్నింటిని సేకరించాడు. భూమి తనదే అని నిరూపించే అన్ని ఆధారాలను తెలిపే అధికారిక డాక్యుమెంట్లను సేకరించి న్యాయం కోసం ఆయన కలవని అధికారి లేడు. ఎంఆర్ఓ స్థాయి నుండి ఆర్డీఓ, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్, పోలీస్ స్టేషన్ ఇలా అందరి దగ్గరి వెళ్లి న్యాయం కోసం అర్థిస్తున్నాడు. 2013 నుండి ఇప్పటి వరకు కొన్ని వందల సార్లు కలెక్టరేట్ కు వచ్చి న్యాయం కోసం అర్థిస్తున్నాడు.
ఎందరో కలెక్టర్లను స్వయంగా కలిసి విజ్ఞాపన పత్రాలు సమర్పించాడు. అయినా ఎలాంటి ఫలితం కనిపించడం లేదని వాపోయాడు. తాజాగా మొన్న సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కూడా ఆశను చంపుకోలేక అన్ని రెండు క్యారీ బ్యాగుల్లో నింపిన అన్ని పత్రాలను మోసుకుని కలెక్టరేట్‌కు వచ్చాడు. ఆయన ను పలకరించి విషయం తెలుసుకుందామని పలకరించిన ‘దిశ’ ప్రతినిధికి తన గోడును వెల్లబోసుకుని కన్నీటి పర్యంతమయ్యాడు. ఎంతో ఆశతో న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్న తనను ఎవరూ పట్టించుకోవడం లేదని కంట తడిపెట్టాడు. తను 1964 లో వరంగల్ జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లా కాలూరుకు ఇల్లరికం వచ్చానని, తనకు తన పేరు మీద 1.30 ఎకరాల భూమి, తన భార్య పేరు మీద 3.20 ఎకరాల భూమి ఉందన్నారు.
ఈ భూములకు సంబంధించిన పట్టా పుస్తకాలు తమ వద్దే ఉన్నా ఆ భూములు మాత్రం కబ్జాకు గురయ్యాయని రోదిస్తూ తెలిపారు. తమ దగ్గరి బంధువైన ఒకరు అక్రమంగా తమ భూములను కబ్జా చేసుకుని మమ్మల్ని బెదిరింపులకు గురిచేస్తున్నాడని, తమ కుటుంబానికి ఆ భూములే ఆధారమని జిన్న లింగారెడ్డి అన్నారు. భూసమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సుల్లో తన దరఖాస్తును కూడా అధికారులు స్వీకరించ లేదన్నారు. ఎందరో జిల్లా కలెక్టర్లకు దరఖాస్తులు ఇచ్చినా తన సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. తన భూమిని కబ్జా చేసిన వ్యక్తికి అధికార పార్టీ అండదండలున్నాయని, తనను భయభ్రాంతులకు గురి చేస్తూ చంపేస్తానని బెదిరిస్తున్నాడని వాపోయాడు. కలెక్టరే చొరవ చూపి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు.






