కూతురే కొడుకైంది.. తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన వైనం!

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-02 04:40:09  IST  )

సమాజంలో మారుతున్న ఆలోచనలకు నిదర్శనంగా నిలిచే ఘటన మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలంలో చోటుచేసుకుంది.

కూతురే కొడుకైంది.. తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన వైనం!
X

దిశ, మహమ్మదాబాద్/ గండీడ్: సమాజంలో మారుతున్న ఆలోచనలకు నిదర్శనంగా నిలిచే ఘటన మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలంలో చోటుచేసుకుంది. "ఆడపిల్ల అయితేనేం.. కొడుకుతో సమానమే" అని నిరూపిస్తూ ఓ యువతి తన తండ్రికి స్వయంగా అంతిమ సంస్కారాలు నిర్వహించి అందరి ప్రశంసలు అందుకుంది. గండీడ్ మండలంలోని వెన్నచేడ గ్రామానికి చెందిన వెంకటరమణ(42) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయనకు కుమారులు లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఆయన ఏకైక కుమార్తె అర్చన ధైర్యంగా ముందుకు వచ్చింది.

తండ్రి చివరి ప్రయాణంలో తానే బాధ్యత తీసుకుంటానని కుటుంబ సభ్యులకు తెలిపిన అర్చన, సంప్రదాయాలకు భిన్నంగా స్వయంగా అంతిమ సంస్కారాలు నిర్వహించింది. హిందూ ఆచారాల ప్రకారం తండ్రి చితికి నిప్పు పెట్టి తన బాధ్యతను నిర్వర్తించింది. అర్చన చూపిన ధైర్యం, తండ్రి పట్ల ఆమెకు ఉన్న ప్రేమ, బాధ్యత భావం అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేశాయి. "ఆడపిల్లలు కూడా అన్ని బాధ్యతలు సమర్థంగా నిర్వర్తించగలరు" అనే సందేశాన్ని ఆమె తన చర్యతో చాటిచెప్పిందని గ్రామస్తులు, బంధువులు అభినందించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారగా, కుమార్తెలు కూడా తల్లిదండ్రులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తారనే విషయాన్ని మరోసారి స్పష్టం చేసిందని పలువురు అభిప్రాయపడ్డారు.

Next Story