హైదరాబాద్‌లో కల్తీ మాంసం కలకలం.. మేక మాంసంలో ఎద్దు మాంసం కలిపి హోటళ్లకు సప్లై

by Malleboina Mahesh |

హైదరాబాద్‌లో కల్తీ మాంసం గుట్టురట్టు.. మేక మాంసంలో ఎద్దు మాంసం కలిపి హోటళ్లకు అమ్ముతున్న ఉస్మాన్ ఖురేషి అరెస్ట్.. 50 కేజీల మాంసం సీజ్!

హైదరాబాద్‌లో కల్తీ మాంసం కలకలం.. మేక మాంసంలో ఎద్దు మాంసం కలిపి హోటళ్లకు సప్లై
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు (Food safety officials) తనిఖీల్లో కల్లీ మాంసం కలకలం గా మారింది. ఈ రోజు ఉదయం జరిపిన ఆకస్మిక తనిఖీల్లో వరుసగా భయంకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మేక మాంసంలో ఎద్దు మాంసాన్ని కలిపి (కల్తీ చేసి) విక్రయిస్తున్న ఒక ముఠా గుట్టు రట్టయింది. H-FAST (హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్) అధికారులు, స్థానిక పోలీసులు ఉమ్మడిగా జరిపిన మెరుపు దాడిలో నిందితుడు ఉస్మాన్ ఖురేషి అడ్డంగా బుక్కయ్యాడు.

50 కేజీల మాంసం సీజ్..

నిందితుడు ఉస్మాన్ ఖురేషి మల్లెపల్లి ప్రాంతంలో షాపు నిర్వహిస్తూ.. తక్కువ ధరకే వస్తుందనే ఆశతో మేక మాంసం లో పెద్ద మొత్తంలో ఎద్దు మాంసాన్ని (beef) మిక్స్ చేస్తున్నాడు. ఈ కల్తీ మాంసాన్ని నగరంలోని ఫేమస్ బిర్యానీ పాయింట్లు, హోటళ్లకు తక్కువ ధరకే గుట్టుచప్పుడు కాకుండా సప్లై చేస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. పక్కా సమాచారంతో సదరు షాపుపై దాడి చేసిన టాస్క్‌ఫోర్స్ బృందం.. అక్కడ విక్రయానికి సిద్ధంగా ఉంచిన 50 కేజీల కల్తీ మాంసాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేసింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు, అతని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా? నగరంలో ఏయే హోటళ్లకు ఈ మాంసాన్ని సరఫరా చేశాడనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

Next Story