శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం.. 20 మంది మహిళలు అరెస్ట్

by Malleboina Mahesh |

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నకిలీ వీసాలతో మస్కట్ వెళ్లేందుకు యత్నించిన ఏపీ తూ.గో. జిల్లాకు చెందిన 20 మంది మహిళల అరెస్ట్.. ఏజెంట్ మోసం చేశాడని ఆవేదన!

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కలకలం.. 20 మంది మహిళలు అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లోని శంషాబాద్‌లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) లో భారీ వీసా మోసం వెలుగుచూసింది. నకిలీ వీసాలతో విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆంధ్రప్రదేశ్‌ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన 20 మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. సదరు మహిళలంతా ఒమన్ ఎయిర్‌వేస్ విమానంలో మస్కట్ వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడ ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ తనిఖీలు నిర్వహిస్తుండగా, వారు సమర్పించిన వీసాలు నకిలీవని (Fake Visas) అధికారులు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన ఇమ్మిగ్రేషన్ సిబ్బంది వారిని వెంటనే అదుపులోకి తీసుకుని, తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ క్రైమ్ ఔట్‌పోస్ట్ పోలీసులకు అప్పగించారు.

ఏజెంట్ చేతిలో మోసపోయామంటూ బాధితుల ఆవేదన..

పోలీసుల విచారణలో బాధితులు కన్నీరుమున్నీరైనట్లు తెలుస్తుంది. ఉపాధి కోసం తాము విదేశాలకు వెళ్లేందుకు ఒక ట్రావెల్ ఏజెంట్‌ను ఆశ్రయించామని, అతను అసలు వీసాలు అని చెప్పి తమ వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి నకిలీ వీసాలు ఇచ్చి మోసం చేశాడని మహిళలు వాపోయారు. తమకు ఎలాంటి తప్పు తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన శంషాబాద్ పోలీసులు, సదరు మహిళలను మోసం చేసిన ముఠా, ఏజెంట్ ఎవరనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సమాచారం అందుతుంది.

Next Story