- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లే పని లేదు.. ఇంటి నుంచే 17 రకాల సేవలు!
తెలంగాణ రవాణా శాఖ ఫేస్‌లెస్ సేవలను ప్రారంభించింది. ఆధార్ ధృవీకరణ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ, చిరునామా మార్పు వంటి 17 రకాల సేవలను ఇకపై ఇంటి నుండే ఆన్‌లైన్‌లో పొందవచ్చు

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రవాణా శాఖ (Telangana Transport Department) సాంకేతికత దిశగా మరో భారీ అడుగు వేసింది. ఆర్టీఏ సేవలను ప్రజల ముంగిటకే చేరవేస్తూ, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకమైన పాలన అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ (Driving license) రెన్యూవల్ కోసమో, చిరునామా మార్పు కోసమో గంటల తరబడి ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. ప్రజల సౌకర్యార్థం సారథి మాడ్యూల్‌లో ఏకంగా 17 రకాల కీలక సేవలను ఫేస్‌లెస్ విధానంలోకి మార్చుతూ రవాణా శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. డిజిటల్ గవర్నెన్స్‌ను బలోపేతం చేసే క్రమంలో భాగంగా ఈ సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సరికొత్త విధానం ద్వారా ఆధార్ ధృవీకరణ ఆధారంగా పౌరులు తమ ఇంటి వద్ద నుండే ఆన్‌లైన్ ద్వారా వివిధ సేవలను పొందవచ్చు.
ఆధార్ ఉంటే చాలు.. అన్నీ ఆన్‌లైనే
తెలంగాణ రవాణా శాఖలో జాతీయ రవాణా పోర్టల్ సారథి సేవలు గత ఏడాది సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా ప్రారంభమయ్యాయి. అయితే పోర్టల్ అప్ గ్రేడేషన్ ప్రక్రియ దశలవారీగా కొనసాగుతూ వస్తోంది. ఎన్ఐసీ సర్వర్ తో అనుసంధానించే ప్రక్రియే ఇటీవలే పూర్తయింది. దీంతో పాటు వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే వాహన్ సేవలను సైతం పూర్తిగా ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి వాహనాల షోరూంలకే అప్పగించారు. దీంతో వాహనదారులకు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సిన పని లేకుండా పోయింది. ఫేస్‌లెస్ విధానం ద్వారా పౌరులు తమ ఆధార్ కార్డులోని డేటా ఆధారంగా, బయోమెట్రిక్ ధృవీకరణతో రవాణా కార్యాలయానికి వెళ్లకుండానే పనులను పూర్తి చేసుకోవచ్చు. లైసెన్స్‌లో తప్పుల సవరణ నుంచి డూప్లికేట్ కార్డుల జారీ వరకు అన్నీ వేలిముద్రల ధృవీకరణతో వేగవంతం కానున్నాయి.
ఆధార్ ఆధారిత ధృవీకరణతో ప్రధాన సేవలు..
1. లర్నర్ లైసెన్స్‌లో చిరునామా మార్పు, 2. లర్నర్ లైసెన్స్‌లో పేరు మార్పు, 3. లర్నర్ లైసెన్స్‌లో ఫోటో, సంతకం మార్పు, 4. డూప్లికేట్ లర్నర్ లైసెన్స్ జారీ, 5. లర్నర్ లైసెన్స్ ఎక్స్‌ట్రాక్ట్, 6. డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ, 7. డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ, 8. డ్రైవింగ్ లైసెన్స్ ప్రతిస్థాపన, 9. డ్రైవింగ్ లైసెన్స్‌లో చిరునామా మార్పు, 10. డ్రైవింగ్ లైసెన్స్‌లో పేరు మార్పు, 11. డ్రైవింగ్ లైసెన్స్‌లో బయోమెట్రిక్ మార్పులు, 12. డ్రైవింగ్ లైసెన్స్‌లో పుట్టిన తేది మార్పు, 13. డ్రైవింగ్ లైసెన్స్‌లో ఫోటో మరియు సంతకం మార్పు, 14. డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌ట్రాక్ట్, 15. లైసెన్స్ నుండి వాహన తరగతి తొలగింపు, 16. ప్రమాదకర పదార్థాల రవాణా వాహనాలు నడిపేందుకు ఎండోర్స్‌మెంట్, 17. డూప్లికేట్ పబ్లిక్ సర్వీస్ వెహికల్ (పీఎస్వీ) బ్యాడ్జ్ జారీ
మొబైల్ యాప్‌లోనూ సేవలు..
ప్రస్తుతం ఆధార్ బేస్డ్ రవాణా సేవలు అధికారిక సారథి వెబ్‌సైట్‌లో అందుబాటులో వచ్చాయి. రాబోయే మూడు రోజుల్లో నెక్స్ట్‌జెన్ ఎం-పరివాహన్ (NextGen mParivahan) మొబైల్ యాప్‌లో కూడా ఈ సౌకర్యాన్ని తీసుకువస్తున్నాం. డిజిటల్ పరిపాలనను బలోపేతం చేయడంలో భాగంగానే ఈ ఫేస్‌లెస్ సేవలను ప్రవేశపెట్టాం. దీనివల్ల ప్రజలకు సమయం ఆదా అవ్వడమే కాకుండా, ఆర్టీఏ కార్యాలయాల్లో రద్దీ తగ్గుతుంది. పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించడమే మా తొలి ప్రాధాన్యత. పౌరులు ఈ సదుపాయాలను సద్వినియోగించుకోవాలి. మరిన్ని వివరాలకు రవాణా శాఖ అధికారిక పోర్టల్‌ను సందర్శించాలి.:- డా. కె. ఇలంబరితి, రవాణా శాఖ కమిషనర్






