- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్ధరాత్రి దాటితే హైవే పై నో ఫుడ్
అర్ధరాత్రి 12 గంటలు దాటిందంటే చాలు.. 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు బంద్ అవుతుండడంతో ప్రయాణికులు, యాత్రికులు ఫుడ్ దొరకక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

దిశ, భిక్కనూరు : అర్ధరాత్రి 12 గంటలు దాటిందంటే చాలు.. 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు బంద్ అవుతుండడంతో ప్రయాణికులు, యాత్రికులు ఫుడ్ దొరకక అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ నుంచి రాత్రి వేళ ప్రయాణం సాగించే వారితో పాటు, మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి, తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల నుంచి హైదరాబాద్ వైపు 44వ జాతీయ రహదారిపై రాకపోకలు సాగించే వారికి ఫుడ్ దొరకకపోగా.. కనీసం చాయ్ కాదు కదా, నీళ్ల బాటిల్ కూడా దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో అర్ధరాత్రి ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాల్లో ప్రయాణం చేస్తున్నవారు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి తలెత్తింది.
కామారెడ్డి జిల్లా సరిహద్దు దాటి మెదక్ జిల్లా లేదా నిజామాబాద్ జిల్లాల్లోకి ప్రవేశిస్తే తప్ప, చాయ్, నీళ్ల బాటిల్, ఫుడ్ దొరకని పరిస్థితి ఉంది. పోలీస్ స్టేషన్ల వారీగా స్థానిక పోలీసులు హైవే పై పెట్రోలింగ్ నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారి ఫొటోలు తీసి ఫైన్‌లు వేస్తుండగా, జిల్లా పోలీసు కార్యాలయం నుంచి మరో టీమ్ కూడా గస్తీ నిర్వహిస్తోంది. వీరితో పాటు జీఎంఆర్ పెట్రోలింగ్ సిబ్బంది సైతం ఫొటోలు తీసి పోలీసులకు అప్‌లోడ్ చేస్తూ భారీగా ఫైన్‌లు విధిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక దాబాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, టీ పాయింట్ల యజమానులు స్వచ్ఛందంగానే దుకాణాలు మూసేస్తున్నారు. రాత్రి 12 గంటల నుంచి వేకువ జామున 4 గంటల వరకు హైవే పక్కన ఉన్న దుకాణాలన్నీ పూర్తిగా బంద్ అవుతున్నాయి.
అయితే కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామ సమీపంలోని పెట్రోల్ బంక్‌లో ఉన్న కేఫ్ సెంటర్ మాత్రం తెరిచే ఉండడం పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మాపై నిక్కచ్చిగా వ్యవహరిస్తున్న పోలీసులు, ఆ కేఫ్ సెంటర్‌ను మాత్రం ఎందుకు మూసివేయించడం లేదని హోటల్ యజమానులు ప్రశ్నిస్తున్నారు.
ఆ ఘటనతో మరింత నిక్కచ్చిగా...
హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు స్కూటీ పై వెళ్తున్న ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు భిక్కనూరు మండలం సిద్ధరామేశ్వరనగర్ గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారి పక్కన మూసి ఉన్న దాబా వద్దకు వెళ్లి నీళ్ల బాటిల్ కావాలని అడిగారు. సమయం దాటిన తర్వాత మేము ఏమీ విక్రయించలేమని దాబా యజమాని తేల్చి చెప్పడంతో, అతనితో వాగ్వాదానికి దిగి 100 నంబర్‌కు కాల్ చేశారు. రూ.500 తీసుకుని కూడా నీళ్ల బాటిల్ ఇవ్వలేదంటూ యజమానిపై తప్పుడు ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత తాము తప్పుడు ఫిర్యాదు చేశామని గుర్తు తెలియని దుండగులు పోలీసుల ఎదుటే ఒప్పుకున్నారు. వారి కదలికలపై అనుమానం వచ్చిన పోలీసులు స్కూటీ తాళంతో పాటు వారి సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో "మా తాళం చెవి, ఫోన్లు ఎందుకు తీసుకుంటారు ?" అంటూ వారు పోలీసులపైనే దాడికి దిగారు. వారిని అడ్డుకునేందుకు వెళ్లిన దాబా యజమానితో పాటు మరో వ్యక్తి కూడా అక్కడికి చేరుకొని దుండగులతో పరస్పరం ఘర్షణకు దిగారు. ఈ గందరగోళంలో గుర్తుతెలియని దుండగులు పోలీసుల కళ్లుగప్పి అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు మరుసటి రోజు ఒకరిని, మరో రెండు రోజుల తర్వాత ప్రధాన నిందితుడిని పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి హోటళ్లు, దాబాలు, టీ పాయింట్లు రాత్రివేళల్లో కచ్చితంగా బంద్ అయ్యేలా మరింత కఠినంగా చర్యలు తీసుకుంటున్నారు.
అఫెన్స్ ఆపేందుకే...
హైవేల పై జరుగుతున్న అఫెన్స్‌ను అరికట్టేందుకే జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అర్ధరాత్రి వేళ హోటళ్లు, దాబాలు, టీ పాయింట్లు మూసివేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో గత ఆరు నెలలుగా 44వ జాతీయ రహదారిపై భిక్కనూరు మండలం బస్వాపూర్ నుంచి కామారెడ్డి జిల్లా సరిహద్దు వరకు ఉన్న హోటళ్లు, దాబాలు అన్నీ రాత్రివేళల్లో మూసి ఉంటున్నాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి రాత్రి వేళ ప్రయాణించే వారికి జిల్లా సరిహద్దు దాటే వరకు ఎక్కడా ఫుడ్ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఎక్కడైనా అఫెన్స్ జరిగితే నిందితులను పట్టుకోవడం కష్టంగా మారడంతో పాటు, అర్ధరాత్రి హోటళ్లు తెరిచి ఉండడం వల్ల నేరాలకు పాల్పడిన వారు అక్కడ ఆశ్రయం పొందే అవకాశం ఉంటుందనే కారణంతోనే జిల్లా పోలీసు యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.






