- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికల పీఠం కోసం 8 కోట్లు ఖర్చు.. ఓటర్ల నిర్ణయంతో షాక్ అయిన మేయర్ అభ్యర్థి
నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి కాటిపల్లి శమంతకు ఓటమి తప్పలేదు. కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రచారం జరిగినప్పటికీ, 19వ డివిజన్ ఓటర్లు బీజేపీ అభ్యర్థికి పట్టం కట్టారు. ఈ పరిణామంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ కార్పోరేషన్ (Nizamabad Corporation) పోటీలో నిలిచిన అభ్యర్థి.. రూ. 8 కోట్ల బకాయి పన్నులను చెల్లించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అలాగే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మేయర్ అభ్యర్థిగా పోటీలో ఉండటంతో గెలుపు కోసం భారీగా ఖర్చు చేశారు. అయినప్పటికి నిజామాబాద్ 19వ డివిజన్ ఓటర్లు మాత్రం ఉహించని షాక్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే.. కాటిపల్లి శమంత (Katipally Samantha) నామినేషన్ వేసే సమయంలోనే రూ. 8 కోట్ల పన్ను చెల్లించారు. ఆమె 19వ డివిజన్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పార్టీ ఆమెను ముందుగానే మేయర్ అభ్యర్థిగా ప్రకటించడంతో, గెలుపు కోసం శమంత భారీగా ఖర్చు చేసినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లను ఆకర్షించేందుకు శమంత భారీగా వ్యయం చేశారని సమాచారం. తన సొంత డివిజన్‌లో ఒక్కో ఓటుకు వేల రూపాయలు పంపిణీ చేయడమే కాకుండా, నగరంలోని ఇతర డివిజన్లలోని కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కూడా భారీగా ఆర్థిక సాయం అందించారు. మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో ధన బలాన్ని నమ్ముకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఓటరు నాడిని పట్టుకోవడంలో ఆమె విఫలమయ్యారు. డబ్బు సంచులు విప్పినా ఫలితం అనుకూలంగా రాకపోవడం కాంగ్రెస్ శ్రేణులను విస్మయానికి గురిచేసింది.
చివరకు 19వ డివిజన్ ఓటర్లు బీజేపీ అభ్యర్థికి పట్టం కట్టడంతో శమంత పరాజయం పాలయ్యారు. మేయర్ కావాలన్న ఆశతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన అభ్యర్థికి, సాధారణ అభ్యర్థి చేతిలో ఓటమి ఎదురుకావడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారీ వ్యయం చేసినా దక్కని గెలుపు, రాజకీయాల్లో ధన ప్రభావం కంటే ప్రజాభిప్రాయమే బలమైనదని మరోసారి చాటిచెప్పిందని సోషల్ మీడియా వేదికగా చర్చించుకుంటున్నారు.






