దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారు.. నెహ్రూ-గాంధీ ఫ్యామిలీపై నితిన్ నబిన్ తీవ్ర ఆరోపణలు

by Malleboina Mahesh |

నెహ్రూ-గాంధీ కుటుంబం దేశ ప్రయోజనాల కంటే వ్యక్తిగత లబ్ధికే ప్రాధాన్యత ఇచ్చిందని నితిన్ నబిన్ విమర్శించారు. నెహ్రూ టిబెట్‌ను చైనాకు అప్పగించారని, కాంగ్రెస్‌కు CIA నిధులు అందాయని ఆయన ఆరోపించారు.

దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టారు.. నెహ్రూ-గాంధీ ఫ్యామిలీపై నితిన్ నబిన్ తీవ్ర ఆరోపణలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితీన్ నబిన్ (Nitin Nabin) కాంగ్రెస్ అగ్ర నేతలు అయిన నెహ్రూ-గాంధీ కుటుంబంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. గాంధీ కుటుంబం ఎల్లప్పుడూ దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి తమ వ్యక్తిగత ప్రయోజనాలనే కాపాడుకుంటూ వస్తోందని ఆయన ఆరోపించారు. జవహర్‌లాల్ నెహ్రూ హయాం నుంచే ఈ "రాజీ మిషన్" కొనసాగుతోందని, 1954లో టిబెట్‌పై భారత్‌కు ఉన్న హక్కులను ఆయన చైనాకు అప్పగించారని విమర్శించారు. ఒకానొక సమయంలో నెహ్రూ దేశంలోని 45 కోట్ల మంది ప్రజలను తనకు ఒక భారంగా (Liability) భావించారని, విదేశీ శక్తులతో ఆయనకు ఉన్న సంబంధాలు దేశానికి నష్టం చేకూర్చాయని నితిన్ నబిన్ ధ్వజమెత్తారు.

నెహ్రూ వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రస్తుత నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కూడా విదేశీ శక్తుల చేతిలో కీలుబొమ్మగా మారారని నబిన్ విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి అమెరికా నిఘా సంస్థ CIA నిధులు సమకూర్చినట్లు అప్పటి యూఎస్ అంబాసిడర్ అంగీకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తన హయాంలో జరిగిన రక్షణ ఒప్పందాలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం, తన బ్యాంకు ఖాతాలను నింపుకోవడానికి వాడుకున్నారని ఆరోపించారు. దేశ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ విదేశీ అజెండాను అమలు చేయడమే గాంధీ కుటుంబం లక్ష్యమని ఈ సందర్భంగా నితిన్ నబిన్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.

Next Story