- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీతాల కోసం ఆందోళనకు సిద్ధమవుతున్న ఎన్.హెచ్.ఎం సిబ్బంది
తమ 6 నెలల వేతన బకాయిల కోసం భారీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని ఎన్.హెచ్.ఎం సిబ్బంది తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్.హెచ్.ఎం) కార్యక్రమాన్ని 2000లో నాటి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యసేవలు అందించేందుకు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ద్వారా వివిధ విభాగాల్లో ఉద్యోగులు, సిబ్బంది నియమించింది. నాటి నుంచి ఉద్యోగులు అరకొర వేతనాలతోనే ఈ ఉద్యోగులు నెట్టుకువస్తున్నారు. ఇప్పుడు ఆ వచ్చే జీతాలు కూడా సకాలంలో ఇవ్వకపోవడంతో కుటుంబాల పోషణ కూడా భారంగా మారిందని వాపోతున్నారు. కొందరికి 6 నెలలుగా, మరికొందరికి 2 నెలలుగా వేతనాలు రాక సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
6 నెలలుగా వేతనాలు లేవు...
రాష్ట్ర వ్యాప్తంగా 17,541 మంది ఎన్.హెచ్.ఎం కింద పనిచేస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ లో చెప్పాపెట్టకుండా వీరిలో కొందరిని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా నిర్ణయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు కనీసం రెండు నెలలకు ఓసారి అయినా వచ్చే వేతనాలు ఔట్ సోర్సింగ్ గా మార్చిన తర్వాత నుంచి రాకుండా పోయాయని ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా తెలిపారు. 510 జీవో ప్రకారం వాచ్ మెన్, స్వీపర్, ఎన్.ఆర్ సి. కౌన్సిలర్స్, కుక్స్, కౌన్సిలర్స్, బ్లాక్ లెవెల్ అకౌంటెంట్స్, డీఈఓలు, ల్యాబ్ అటెండర్, ప్రోగ్రాం ఆఫీసర్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కమ్యూనిటీ మొబిలైజర్, సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు తదితర సపోర్టింగ్ స్టాఫ్ తో పాటు పలు కేటగిరీలకు చెందిన వారిని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా మార్చేసి... వైద్యులు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లను మాత్రమే కాంట్రాక్టు ఉద్యోగులుగా కొనసాగిస్తున్నారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 6 నెలలుగా వేతనాలను సదరు ఏజెన్సీలు ఇవ్వడం లేదు. తమకు ప్రభుత్వం నుంచి వస్తే కదా మీకు ఇచ్చేదని ఏజెన్సీలు చెబుతున్నాయని ఎన్.హెచ్.ఎం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వాపోతున్నారు. మరోవైపు కాంట్రాక్టు ఉద్యోగులకు సైతం రెండు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదని ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల నేత ఎం నరసింహ తెలిపారు. ప్రజారోగ్యానికి పట్టుకొమ్మలైన సర్కారు దవాఖానల్లో పనిచేసే సిబ్బందికి వేతనాలు లేకుంటే వారి కుటుంబాల పోషణ ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
ఈ నెల 29న మహాధర్నా...
6 నెలలుగా పెండింగ్ లో ఉన్న తమ వేతనాలు చెల్లించాలని మంగళవారం నుంచి నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలుపుతున్నట్లు ఎన్.హెచ్.ఎం ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా తెలిపారు. తమ వేతనాలు చెల్లించకుంటే ఈ నెల 29న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని వెల్లడించారు. జీతాలు రాక తమ కుటుంబాలను పోషించుకునే పరిస్థితి లేకుండా పోయిందని... ప్రభుత్వం స్పందించి ఆదుకునాలని ఎన్.హెచ్.ఎం ఉద్యోగులు కోరుతున్నారు.
- Tags
- NHM






