జవహర్‌నగర్ వ్యర్థాల నిర్వహణకు సమగ్ర కార్యాచరణ

by Ratna Kumari |

జవహర్‌నగర్‌లో శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణ, ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు సమగ్ర కార్యాచరణ చేపడుతున్నట్లు జయేశ్ రంజన్ తెలిపారు.

జవహర్‌నగర్ వ్యర్థాల నిర్వహణకు సమగ్ర కార్యాచరణ
X

దిశ, జవహర్‌నగర్ : జవహర్‌నగర్‌ను శాస్త్రీయ ఘన వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, ఆధునిక సాంకేతికతల సమన్వయంతో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. మంగళవారం జవహర్‌నగర్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్‌ను పరిశీలించి వ్యర్థాల సేకరణ నుంచి విద్యుత్ ఉత్పత్తి వరకు అమలవుతున్న ప్రక్రియలను సమీక్షించారు. అనంతరం వైఎస్ఆర్ నగర్, గబ్బిలాలపేట ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.

తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, డ్రైనేజీ, విద్య, ఆరోగ్య సేవలు, ఉపాధి వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ల్యాండ్‌ఫిల్ రిమిడియేషన్, బయోగ్యాస్ ఉత్పత్తి, వ్యర్థాల పునర్వినియోగం, కాలుష్య నియంత్రణకు ఆధునిక సాంకేతికతలను వినియోగించాలని సూచించారు. ప్రతి ఇంటి వద్దే తడి–పొడి చెత్త వేరు చేయడం, సమర్థవంతమైన డోర్-టు-డోర్ వ్యర్థాల సేకరణ, ప్రజల్లో అవగాహన పెంపుతోనే పరిశుభ్రమైన పట్టణ వాతావరణం సాధ్యమని జయేశ్ రంజన్ పేర్కొన్నారు. జవహర్‌నగర్ పరిసర ప్రాంతాల్లో ఉపాధి, విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, హరితాభివృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. సమావేశంలో మల్కాజ్‌గిరి కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, ఐఐటీ బాంబే నిపుణులు, జే-పాల్ ప్రతినిధులు, రామ్‌కీ సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story