కార్పొరేట్ కంపెనీలే లక్ష్యంగా కొత్త 'వాట్సాప్' మోసం.. సీపీ సజ్జనార్ హెచ్చరిక!

by Malleboina Mahesh |

వాట్సాప్‌లో సీఈఓ పేరుతో కొత్త తరహా మోసం! కంపెనీల అకౌంటెంట్లను బురిడీ కొట్టిస్తున్న సైబర్ నేరగాళ్లు. అప్రమత్తంగా ఉండాలన్న సీపీ సజ్జనార్.

కార్పొరేట్ కంపెనీలే లక్ష్యంగా కొత్త వాట్సాప్ మోసం.. సీపీ సజ్జనార్ హెచ్చరిక!
X

దిశ, వెబ్ డెస్క్: సైబర్ నేరగాళ్లు సరికొత్త ఎత్తుగడలతో బడా వ్యాపార సంస్థలను నిలువునా ముంచుతున్నారు. ముఖ్యంగా కంపెనీల సీఈఓలు (CEOs), సీఎఫ్ఓలు (CFOs), అకౌంటెంట్లను లక్ష్యంగా చేసుకుని 'వాట్సాప్ ఇంపర్సనేషన్ ఫ్రాడ్' ('WhatsApp impersonation fraud')కు తెరలేపారని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ (V.C. Sajjanar) హెచ్చరించారు. తొలుత కంపెనీల అధికారిక ఈమెయిల్స్‌కు హానికరమైన ఫిషింగ్ లింకులు పంపి, మాల్వేర్ ద్వారా కంప్యూటర్లపై పూర్తి స్థాయి రిమోట్ యాక్సెస్‌ను పొందుతారు. ఆ తర్వాత సిస్టమ్‌లో యాక్టివ్‌గా ఉన్న 'వాట్సాప్ వెబ్' సెషన్లను ఉపయోగించి, సీఈఓ పేరుతో అకౌంటెంట్లకు మెసేజ్ పంపిస్తారు. "నేను అత్యవసర సమావేశంలో ఉన్నాను, ఫోన్ ఎత్తడం వీలుపడదు.. ఈ అకౌంట్‌కు వెంటనే కోట్లాది రూపాయలు బదిలీ చేయండి" అని నమ్మబలుకుతూ సంస్థల సొమ్మును కాజేస్తున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు.

ఇటీవల హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటువంటి కేసులు వెలుగు చూస్తున్న నేపథ్యంలో ప్రతి కంపెనీ అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. వాట్సాప్‌లో పై అధికారుల పేరుతో వచ్చే ఆర్థిక అభ్యర్థనలను గుడ్డిగా నమ్మకూడదని, అకౌంటెంట్లు వెంటనే సదరు అధికారికి నేరుగా ఫోన్ చేసి ధృవీకరించుకోవాలని కోరారు. ఆఫీసు సిస్టమ్స్‌లో నాణ్యమైన ఫైర్‌వాల్స్, యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేయడంతో పాటు, వాట్సాప్ వెబ్ వాడిన ప్రతిసారి తప్పకుండా లాగౌట్ చేయాలని ఆయన సూచించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని, cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సిటీ పోలీస్ బాస్ స్పష్టం చేశారు.

Next Story