ప్రేమికులరోజు లింక్.. ఓపెన్ చేస్తే ఖాతా ఖాళీ

by Muthe.Rajitha |

వాలంటైన్స్ డే పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు.

ప్రేమికులరోజు లింక్.. ఓపెన్ చేస్తే ఖాతా ఖాళీ
X

దిశ, వెబ్ డెస్క్ : వాలంటైన్స్ డే నేపథ్యంలో సైబర్‌ మోసగాళ్లు కొత్త దందాకు తెరలేపారు. సైబర్ క్రిమినల్స్ మోసాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు ప్రజలను హెచ్చరించారు.వాలంటైన్స్ డే ను దృష్టిలో పెట్టుకొని.. నకిలీ డేటింగ్‌ ప్రొఫైళ్లు, వాలంటైన్స్ గిఫ్ట్ ఆఫర్లు, ఫ్లవర్‌ డెలివరీ స్కామ్‌లు, ప్రత్యేక డిస్కౌంట్ లింకులు వంటి పేర్లతో సందేశాలు పంపుతూ అమాయకులను మోసం చేస్తునట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఈ నేరాల వల్ల డబ్బులు మోసపోవడమే కాకుండా..పర్సనల్ డీటెయిల్స్, బ్యాంకు ఖాతా వివరాలు, సోషల్ మీడియా ఖాతాలు కూడా మోసగాళ్ల చేతికి అందుతాయని, వీటితో అకౌంట్లలో డబ్బులు కాజేయడం, వ్యక్తిగత ఫోటోలు, వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ శిఖా గోయల్ స్పష్టం చేశారు.

సైబర్ నేరగాళ్లు ముందుగా నకిలీ డేటింగ్ యాప్స్ లో ప్రొఫైళ్లు సృష్టించి బాధితులతో పరిచయం పెంచుకుంటారు. కొద్ది రోజుల్లోనే నమ్మకం పొందుతూ వ్యక్తిగతంగా మాట్లాడటం ప్రారంభిస్తారు. ఆ తర్వాత వాలంటైన్స్ డే సందర్భంగా గిఫ్టులు పంపిస్తున్నామని, ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయని, ఈవెంట్ టికెట్లు అందిస్తున్నామని చెబుతూ లింకులు పంపిస్తారు. ఆ లింకులు నకిలీ పేమెంట్ వెబ్‌సైట్‌లకు, హ్యాకింగ్ యాప్‌ల డౌన్‌లోడ్‌కు దారి తీస్తాయి. కొరియర్ ఛార్జీలు, గిఫ్ట్ క్లియరెన్స్ ఫీజులు, అత్యవసర అవసరాల పేరుతో డబ్బు అడుగుతారు. బాధితులు OTPలు, బ్యాంక్ వివరాలు, డెబిట్, క్రెడిట్ కార్డుల సమాచారం పంచుకుంటే వెంటనే ఖాతాలు ఖాళీ చేస్తారు.

ఇలాంటి అనుమానాస్పద లింక్‌పై క్లిక్ చేసినా లేదా మోసపోతున్నామని అనుమానం వచ్చినా వెంటనే బ్యాంకు ఖాతాలు బ్లాక్ చేయించాలని పోలీసులు సూచిస్తున్నారు. OTP, PIN, CVV లేదా వేరిఫికేషన్ కోడ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ చెప్పకూడదని హెచ్చరిస్తున్నారు. ఫోన్లో చాట్స్, లింకులు, ట్రాన్సాక్షన్ వివరాల స్క్రీన్‌షాట్‌లను సేవ్ చేసుకోవాలి. డబ్బు లావాదేవీ జరిగితే వెంటనే బ్యాంక్ లేదా సంబంధిత పేమెంట్ యాప్‌కు సమాచారం ఇవ్వాలి. అలాగే బ్యాంకింగ్, ఈ-మెయిల్, సోషల్ మీడియా పాస్‌వర్డ్‌లను వెంటనే మార్చుకోవాలి.

సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ప్రజలు ముందుగానే జాగ్రత్తగా ఉండటం అత్యంత ముఖ్యమని అధికారులు చెబుతున్నారు. తెలియని ప్రొఫైళ్ల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అంగీకరించకూడదు. ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తులకు డబ్బు పంపకూడదు. వాలంటైన్స్ గిఫ్ట్ లేదా డిస్కౌంట్ పేరుతో వచ్చే లింక్‌లను క్లిక్ చేయరాదు. లింక్ ద్వారా వచ్చే యాప్‌లను అస్సలు ఇన్‌స్టాల్ చేయకూడదు. టూ ఫ్యాక్టర్ అతేంటికేషన్ తప్పనిసరిగా ఉపయోగించాలి. చెల్లింపులు చేయాల్సి వస్తే అధికారిక వెబ్‌సైట్‌లు లేదా యాప్ స్టోర్‌ల ద్వారానే చేయాలని సూచిస్తున్నారు. ఏదైనా మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని తెలంగాణ పోలీసులు సూచించారు.

Next Story