- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TCUR పరిధిలో కొత్త వీధి దీపాలు
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన పరిధిలో వీధి దీపాల నిర్వహణకు టెండర్లు పిలవనున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : వీధి దీపాల వెలుగులు.. గుంతలు లేని.. విశాలమైన రోడ్లపై ప్రయాణం మరిచిపోలేని అనుభూతిని ఇస్తుంది. నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్ని వీధి దీపాలు రాత్రి వేళ సక్రమంగా వెలిగేలా.. రోడ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు. ఇందు కోసం టెండర్లు పిలవనున్నారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్) పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో రోడ్లు, స్ట్రీట్ లైట్స్ నిర్వహణకు టెండర్లు పిలవడానికి ప్రభుత్వం పరిపాలన అనుమతిచ్చింది. టెండర్లు పిలవడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే మూడు కార్పొరేషన్లలో ఒకే సారి పిలవాలా? లేదా? అనేదానిపై క్లారిటీ కోసం ప్రభుత్వానికి లేఖ రాశారు. అధికారులు మాత్రం టెండర్ నోటిఫికేషన్ కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం.
10 ఏండ్ల పాటు స్ట్రీట్ లైట్ల నిర్వహణ
కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని స్ట్రీట్ లైట్ల నిర్వహణను పదేండ్ల పాటు కాంట్రాక్టర్లకు అప్పగించేలా ప్రభుత్వం నిర్ణయించింది. టీసీయూఆర్ పరిధిలో 7,60,591 స్ట్రీట్ లైట్లను అధికారులు గుర్తించారు. జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పరిధిలో రూ.1341.6 కోట్లతో స్ట్రీట్ లైట్లను నిర్వహించనున్నారు. మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో సింగిల్ టెండర్ నిర్వహించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
ఒక్కో స్ట్రీట్ లైట్‌కు నెలకు రూ.186
స్ట్రీట్ లైట్ల నిర్వహణకు సంబంధించి గతంలో ఉన్న విధానానికి కాస్త భిన్నమైన విధానాన్ని అనుసరించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. కేవలం వెలిగే లైట్లకు మాత్రమే మెయింటనెన్స్ చార్జీలను చెల్లించేలా అధికారులు టెండర్లలో మార్పులు చేయనున్నారు. ఢిల్లీ తరహా విధానాన్ని కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోనూ అమలు చేయనున్నారు. ఇదే విధానాన్ని ఇక్కడ అమలు చేసేందుకు కాకతీయ ఎనర్జీ సర్వీసు లిమిటెడ్ అనే సంస్థ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కానీ ఢిల్లీలో కేవలం 3.96 లక్షల స్ట్రీట్ లైట్లుండగా, పన్నెండేళ్ల మెయింటనెన్స్ పీరియడ్‌కు అక్కడి అధికారులు రూ.1,030 కోట్లను చెల్లిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్ఎఫ్‌పీ) ద్వారా ఒక్కో లైట్ల మెయింటనెన్స్ చార్జీలు రూ.186 కోట్ చేస్తూ ఓ ఏజెన్సీ ప్రతిపాదనాలు అందజేసినట్టు తెలిసింది. అయితే ఇది రూ.200 వరకు గానీ పెరిగే అవకాశంతో పాటు రూ.175కు తగ్గే అవకాశాలున్నాయి.
రూ.3,145 కోట్లతో..
కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ ఏరియాల్లో 1,045 కిలోమీటర్లను రూ.3,145 కోట్లతో నిర్వహించడానికి జీహెచ్ఎంసీ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. రోడ్ల నిర్వహణతోపాటు లేన్ మార్కింగ్ ఏడాదికోసారి చేసే విధంగా చర్యలు తీసుకోనున్నారు. దీంతోపాటు స్వీపింగ్ యంత్రాల ద్వారా క్లీనింగ్, ఫూట్ అండ్ సెంట్రల్ మీడియన్స్, సైనేజెస్, క్యాచ్‌పిట్స్, అండ్ మ్యాన్ హోల్స్ మరమ్మతులు వంటి పనులు చేయనున్నారు. అయితే మొదటి దశలో చేపట్టిన 744.22 కిలోమీటర్ల రోడ్లతోపాటు 300.79 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్లను సైతం సీఆర్ఎంపీలో చేర్చారు.
త్వరలోనే టెండర్లు
స్ట్రీట్ లైట్స్, రోడ్ల నిర్వహణకు టెండర్లు పిలవడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. అయితే ముందుగా రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్‌పీ) ద్వారా ప్రతిపాదనలను స్వీకరించాలని అధికారులు నిర్ణయించారు. వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా ఏజెన్సీలను ఫైనల్ చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు.
- Tags
- TCUR






