- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏప్రిల్ 1 నుంచి 'PANCARD'పై కొత్త నిబంధనలు
ఆదాయపు పన్ను నిబంధనలు-2026 పేరుతో కేంద్రం నోటిఫై చేసిన పాన్ కార్డు కొత్త రూల్స్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

దిశ,వెబ్ డెస్క్ : ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు, సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 అమలులో భాగంగా, ఆర్థిక లావాదేవీల్లో అత్యంత కీలకమైన శాశ్వత గుర్తింపు సంఖ్య (PAN) నిబంధనలను సవరిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆదాయపు పన్ను నిబంధనలు-2026 పేరుతో నోటిఫై చేసిన ఈ కొత్త రూల్స్ ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. చిన్న చిన్న నగదు లావాదేవీలకు పాన్ కార్డు సమర్పించాల్సిన అవసరం లేకుండా పరిమితులను గణనీయంగా పెంచడం ఈ మార్పుల ఉద్దేశ్యం.
బ్యాంకు లావాదేవీల్లో భారీ మార్పు
గతంలో బ్యాంకుల్లో రోజుకు రూ. 50,000 మించి నగదు జమ చేసినా లేదా విత్‌డ్రా చేసినా పాన్ కార్డు తప్పనిసరిగా ఉండేది. అయితే కొత్త నిబంధనల ప్రకారం ఈ రోజువారీ పరిమితిని పూర్తిగా తొలగించారు. ఇకపై ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం నగదు లావాదేవీలు (Aggregate) ₹10 లక్షలు దాటితేనే పాన్ కార్డు వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇది చిన్న వ్యాపారులకు, మధ్యతరగతి గృహిణులకు పెద్ద ఊరటనిచ్చే అంశం.
ఆస్తులు, వాహనాల కొనుగోలుపై కొత్త పరిమితులు
రియల్ ఎస్టేట్ మరియు ఆటోమొబైల్ రంగాల్లో కూడా పాన్ నిబంధనలను ప్రభుత్వం సరళతరం చేసింది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో గతంలో రూ.10 లక్షలు దాటితే పాన్ అవసరమయ్యేది, ఇప్పుడు ఆ పరిమితిని రూ.20 లక్షలకు పెంచారు. టూ వీలర్స్ లేదా ఫోర్ వీలర్స్ కొనుగోలు చేసేటప్పుడు రూ.5 లక్షలు మించితేనే పాన్ కార్డు అడుగుతారు. అంతేకాదు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాల్స్ బిల్లులను నగదు రూపంలో చెల్లించేటప్పుడు గతంలో ఉన్న రూ.50,000 పరిమితిని రూ.1 లక్షకు పెంచారు.
ఇన్సూరెన్స్ రంగంలో కఠినతరం
మిగిలిన రంగాల్లో సడలింపులు ఇచ్చినప్పటికీ, బీమా (Insurance) విషయంలో మాత్రం నిబంధనలు కఠినతరం అయ్యాయి. ఇకపై మీరు తీసుకునే ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం ఎంత తక్కువైనా సరే, ప్రారంభంలోనే పాన్ కార్డు సమర్పించడం తప్పనిసరి చేశారు. పారదర్శకతను పెంచేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మధ్యతరగతికి మేలు.. పన్ను ఎగవేతకు అడ్డుకట్ట
"చిన్న చిన్న లావాదేవీలకు పాన్ ఇబ్బంది తగ్గించడం ద్వారా సామాన్యులకు సౌలభ్యం కల్పించడమే మా లక్ష్యం. అదే సమయంలో పెద్ద మొత్తం లావాదేవీలను ఏడాది పొడవునా ట్రాక్ చేయడం ద్వారా పన్ను వ్యవస్థను మరింత సమర్థవంతంగా మారుస్తున్నాం" అని సీబీడీటీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు మారుతున్న నేపథ్యంలో, కొత్త ఆర్థిక సంవత్సరంలో పెద్ద మొత్తంలో లావాదేవీలు ప్లాన్ చేసుకునే వారు ఈ మార్పులను గమనించి తమ పన్ను ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.






