కడ్తాల్‌లో నూతన మండల ప్రజా పరిషత్ కార్యాలయం ప్రారంభం

by Ratna Kumari |

స్వయం సహాయక మహిళా సంఘాల్లో సభ్యత్వం కలిగి ఉంటే అవసర సమయంలో సంఘం మహిళలకు అండగా నిలుస్తుందని మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.

కడ్తాల్‌లో నూతన మండల ప్రజా పరిషత్ కార్యాలయం ప్రారంభం
X

దిశ, కడ్తాల్ : స్వయం సహాయక మహిళా సంఘాల్లో సభ్యత్వం కలిగి ఉంటే అవసర సమయంలో సంఘం మహిళలకు అండగా నిలుస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. కడ్తాల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని మంత్రి సీతక్క, ఎంపీ డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, అధికారులు, నాయకులతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులకు మరిన్ని నిధులు కేటాయించాలని, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాల భవనాల నిర్మాణానికి సహకరించాలని మంత్రిని కోరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.100 కోట్ల నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రభుత్వం ఎన్నికల హామీల అమలుకు కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వాల వైఫల్యాల వల్ల రాష్ట్రం అప్పుల భారంలో చిక్కుకుపోయిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం స్థాయిని కూడా గౌరవించకుండా వ్యాఖ్యలు చేయడం సరికాదని, ప్రజలే తగిన సమయంలో వారికి బుద్ధి చెబుతారని అన్నారు. బీజేపీ నాయకులు ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ ఇప్పిస్తే తెలంగాణ ఎంపీలందరూ సిద్ధంగా ఉన్నారని, అది చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడంతో పాటు కుటుంబ, గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. మహిళా సంఘాల బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే మహిళా సంఘాలకు రూ.61 వేల కోట్ల రుణాలు అందించామని చెప్పారు. వయోపరిమితి లేకుండా 60 సంవత్సరాలు దాటిన వృద్ధులకు కూడా పెన్షన్ అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలకు మెరుగైన పరిపాలనా సేవలు అందించేందుకు అవసరమైన ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు ఆసిఫ్ అలీ, రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) కొప్పిసెట్టి కిరణ్మయి, జెడ్పీ సీఈఓ సీహెచ్ కృష్ణారెడ్డి, డీఆర్‌డీఓ శ్రీలత, ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, డీపీఓ సురేష్ మోహన్, ఈఈ సుదర్శన్ రెడ్డి, డిప్యూటీ ఈఈ శ్రీనివాస్, తహసీల్దార్ జయశ్రీ, సీడీపీఓ శాంతిరేఖ, ఏఎంసీ చైర్మన్ యాట గీత, వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్, ఎంపీడీవో సుజాత, ఏఈ పరమేష్, ఎంపీఓ లాలయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.

Next Story