అక్షరాల ఆలయంగా మారిన కనగల్.. ఉచిత హ్యాండ్‌ రైటింగ్ శిబిరంతో విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం

by Jakkula.Mamatha |

కనగల్ ఎక్స్‌రోడ్డు సమీపంలోని నీలకంఠ గోపాల్ నివాసం ప్రస్తుతం అక్షరాల ఆలయంగా మారింది.

అక్షరాల ఆలయంగా మారిన కనగల్.. ఉచిత హ్యాండ్‌ రైటింగ్ శిబిరంతో విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం
X

దిశ,కనగల్: కనగల్ ఎక్స్‌రోడ్డు సమీపంలోని నీలకంఠ గోపాల్ నివాసం ప్రస్తుతం అక్షరాల ఆలయంగా మారింది. శేఖర్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పది రోజుల ఉచిత హ్యాండ్‌రైటింగ్ శిక్షణా శిబిరం విద్యార్థుల్లో విశేష స్పందనను పొందుతోంది. మండలంలోని వివిధ గ్రామాల నుంచి దాదాపు 80 మందికి పైగా విద్యార్థులు ప్రతిరోజూ శిబిరానికి హాజరై తమ చేతిరాతను మెరుగుపరుచుకునేందుకు శిక్షణ పొందుతున్నారు. ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత తరగతుల విద్యార్థుల వరకు పాల్గొంటూ అక్షరాలు అందంగా, క్రమబద్ధంగా రాయడం నేర్చుకుంటున్నారు. ప్రముఖ హ్యాండ్‌ రైటింగ్ శిక్షకులు కే.సైదులు విద్యార్థులకు అక్షరాల ఆకృతి, లైన్ మెయింటెనెన్స్, రాతలో స్పష్టత వంటి అంశాలపై ఓపికగా శిక్షణ అందిస్తున్నారు.

పరీక్షల్లో మంచి మార్కులు సాధించడంలో, పోటీ పరీక్షల్లో విజయాన్ని అందుకోవడంలో అందమైన చేతిరాత కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన విద్యార్థులకు సూచించారు. కేవలం కొన్ని రోజుల్లోనే పిల్లల రాతలో వస్తున్న మార్పును చూసి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా భారీ ఫీజులు చెల్లించి పొందే శిక్షణను శేఖర్ అకాడమీ ఉచితంగా అందించడం పట్ల స్థానికులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ, వారి భవిష్యత్ లక్ష్యాలకు బలమైన పునాది వేస్తున్న ఈ ఉచిత హ్యాండ్‌రైటింగ్ శిబిరం కనగల్ ప్రాంతంలో ఒక నిశ్శబ్ద విద్యా విప్లవంగా నిలుస్తోంది.

ఉచిత శిక్షణతో కొత్త ఆత్మవిశ్వాసం వచ్చింది..

"నేను ఈ హ్యాండ్‌రైటింగ్ శిక్షణా శిబిరంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు నా రాత స్పష్టంగా ఉండేది కాదు.కానీ సైదులు సార్ చెప్పిన విధంగా ప్రతిరోజూ సాధన చేయడంతో నా చేతిరాతలో చాలా మార్పు వచ్చింది. పరీక్షల్లో సమాధానాలను అందంగా రాయగలిగితే మంచి మార్కులు వస్తాయని తెలుసుకున్నాం. మాకు ఉచితంగా ఇలాంటి శిక్షణ అందిస్తున్న శేఖర్ అకాడమీ వారికి ధన్యవాదాలు. ఈ శిబిరం మా భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను."-తరుణ్(8వ తరగతి కనగల్)

Next Story