- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎబోలా వైరస్ విజృంభణ.. విదేశీ ప్రయాణికుల తప్పుడు అడ్రస్‍లపై మంత్రి సీరియస్ ఆదేశాలు
ఎబోలా వైరస్ మరింత జోరుగా విజృంభిస్తున్న వేళ తెలంగాణ ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. ఇవాళ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులతో సమీక్ష నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు తమ చిరునామా, ఫోన్ నంబర్ తదితర వివరాలను దాచి పెట్టి తప్పుడు సమాచారం ఇస్తే అలాంటి వారిపై ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ సహా వర్తించే చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో చేపట్టిన ముందస్తు జాగ్రత్తలు, పర్యవేక్షణ చర్యలు, వివిధ శాఖల మధ్య సమన్వయం, ఎమర్జన్సీ రెస్పాన్స్ సిస్టమ్, తదితర అంశాలపై మంత్రి దామోదర్ రాజనర్సింహ సోమవారం సెక్రటేరియట్‌లో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా విదేశాల నుంచి వచ్చే కొంత మంది ప్రయాణికులు తమకు ఇచ్చిన అడ్రస్‌లో ఉండడం లేదని అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా ఈ అంశంపై మంత్రి సీరియస్‌గా స్పందించారు. వాస్తవాలను దాచిపెట్టే వారిని తీవ్రంగా పరిగణించాలని, తప్పుడు సమాచారం అందించినట్లయితే చట్టపరమైన చర్యలు, కేసుల నమోదు వంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయాన్ని శంషాబాద్ విమానాశ్రయంలోనే ప్రయాణికులకు స్పష్టంగా తెలియజేయాలని మంత్రి సూచించారు.
శాంపిల్స్ సేకరణ, టెస్టులపై అలసత్వం వద్దు:
అనుమానిత శాంపిల్స్ సేకరణ, టెస్టులు చేయడంలో ఎలాంటి అలసత్వం ఉండకూడదని మంత్రి ఆదేశించారు. కాంటాక్ట్ ట్రేసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ, జీహెచ్ఎంసీ, విమానాశ్రయ అధికారులు, పోలీసు శాఖ తదితర విభాగాల మధ్య సమన్వయాన్ని పెంచాలని మంత్రి ఆదేశించారు. విదేశీ ప్రయాణికులతో సమర్థవంతంగా కమ్యూనికేట్ చేసేందుకు ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ (EFLU) సహకారం తీసుకోవాలన్నారు. ఎబోలా ప్రభావిత దేశాల్లో ఎక్కువగా మాట్లాడే ఫ్రెంచ్, అరబిక్, స్వాహిలి సహా అవసరమైన విదేశీ భాషల్లో మాట్లాడగల సిబ్బందిని మూడు షిఫ్టుల్లో, 24 గంటలపాటు విమానాశ్రయంలో అందుబాటులో ఉంచి పర్యవేక్షణ, సమాచార సేకరణ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలో ఎబోలా వ్యాధి నివారణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోందని, కేంద్ర ఆరోగ్యశాఖ, ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ప్రజలు అపోహలను నమ్మకుండా అధికారిక సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని సూచించారు.
రెండోసారి నెగిటివ్ వస్తేనేడిశ్చార్జ్:
ఎబోలా ప్రభావిత దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే దేశ, విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక నిఘా కొనసాగుతున్నట్లు ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. శంషాబాద్ విమానాశ్రయంలో అమలులో ఉన్న స్క్రీనింగ్, సర్వైలెన్స్ వ్యవస్థలను మరింత బలోపేతం చేశామని తెలిపారు. ప్రభావిత దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల వివరాలను సేకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని 21 రోజుల పాటు నిరంతరం పర్యవేక్షిస్తున్నామని వివరించారు. అనుమానిత లక్షణాలు కనిపించిన వారిని వెంటనే గుర్తించి, గాంధీ హాస్పిటల్‌లో ఐసోలేషన్‌లో ఉంచుతున్నామని, ఇప్పటివరకూ ఇద్దరు అనుమానితులను గాంధీలో ఐసోలేషన్‌లో ఉంచి, వారి సాంపిల్స్‌ను టెస్టుల కోసం పూణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించినట్లు తెలిపారు. అక్కడ చేసిన టెస్టుల్లో వారి ఇద్దరికీ వైరస్ నెగిటివ్ వచ్చిందని మంత్రికి వివరించారు. ఐసీఎంఆర్ సూచన మేరకు వారి సాంపిల్స్‌ను మరోసారి సేకరించి టెస్టుల కోసం పూణేలోని ఎన్‌ఐవీకి పంపించామని చెప్పారు. రెండోసారి నెగిటివ్ వస్తే, వారిని ఐసోలేషన్‌లో నుండి డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఆరోగ్యశాఖకు అవసరమైన సహకారం అందించాలని సీసీఎంబీ డైరెక్టర్‌ను మంత్రి కోరారు. ఐసీఎంఆర్ నుంచి ఎబోలా టెస్టింగ్ కిట్లు వచ్చాయని, టెస్టులు చేయడం ప్రారంభించామని సీసీఎంబీ డైరెక్టర్, డాక్టర్ వినయ్ నందికూరి తెలిపారు. సాంపిల్ వచ్చిన వెంటనే టెస్టులు చేసి, ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం ఇస్తామని ఆయన వివరించారు.






