- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. నగరంలో భారీ దోపిడీ
హైదరాబాద్‌లో నేపాలీ ముఠా మరో భారీ దోపిడీకి పాల్పడింది. దంపతులకు మత్తు ఇచ్చి 60 తులాల బంగారం దోచుకెళ్లిన ఘటన నగరంలో కలకలం రేపుతోంది.

దిశ, మేడ్చల్ బ్యూరో/జవహర్ నగర్: హైదరాబాద్ నగరంలో నేపాలీ గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయింది. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జవహర్ నగర్ ఠాణా పరిధిలో భారీ చోరీకి పాల్పడింది. ఈ ఘటనలో 60 తులాల బంగారం, 25 కిలోల వెండి నగలు,రూ.35 వేల నగదు, 3వేల యూఎస్ డాలర్లను తస్కరించింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య తనుజాను నేపాలీ గ్యాంగ్ హత్య చేసిన కేసు దర్యాప్తులో ఉండగానే ఈ ఘటన నగరంలోనే జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫ్రొపెసర్ దంపతుల చేతులు, కాళ్లు కట్టేసి మరీ చోరీ చేశారు. పూర్తిగా సినీ ఫక్కీలో పుట్టిన రోజు వేడుకలు నిర్వహించి భారీ దోపీడీకి పాల్పడడం కలకలం సృష్టిస్తోంది.
పోలీసులు,బాధితుల కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లోని కౌకూరు గోల్ప్ ఎన్ క్లేవ్ లోని ప్లాట్ నెంబర్ 15 లో విశ్రాంత ఫ్రొఫెసర్ మురళీధర్ మోహన్(68),భార్య డాక్టర్ విజయలక్ష్మి(58) లు నివాసం ఉంటున్నారు. 13 రోజుల క్రితం ఓ నేపాలీ జంట వీరి దగ్గర పనిలో చేరారు. నమ్మకంగా పనిచేస్తూ వారితో సన్నిహితంగా మెలిగారు. ఇటివలే మరో మహిళ వారి బంధువుగా పరిచయమై మెల్లగా ఇంట్లోకి వచ్చింది. సోమవారం రాత్రి నేపాలీ మహిళ పుట్టిన రోజు వేడుకలను ఇంట్లో చేసుకుంటామని ఫ్రొఫెసర్ దంపతులను అడగడంతో వారు అంగీకరించారు. పుట్టిన రోజు వేడుకల కోసం ఆ సమయంలో మరో ముగ్గురు ఇంట్లోకి వచ్చారు.
తాడుతో కట్టేసి..
దంపతులు రాత్రి భోజనం చేస్తుండగా నేపాలీ గ్యాంగ్ జన్మదిన వేడుకలను జరుపుకున్నట్లు నటించారు. కొద్ది సేపటికే వెనుక నుంచి వచ్చి దంపతులను బెదిరించి తాడులతో చేతులను కట్టేశారు. భయాందోళనకు గురైన వారు మమ్మల్ని ఏమి చేయకండి అంటూ మీకు ఎమీ కావాలో తీసుకోండి అని దంపతులు దయనీ పరిస్థితుల్లో వేడుకోవడంతో ఏలాంటి ప్రాణహాని చేయలేదు. అనంతరం మత్తు మందు కలిపిన పదార్థాలను వారి చేత బలవంతంగా తినిపించారు. తర్వాత గదిలోకి తీసుకెళ్లి ఇద్దరిని కట్టేశారు.
ఇంట్లో ఉన్న బంగారం, వెండి,నగలతో నగదు, విదేశీ కరెన్సీ తో ఆటోలో పరారయ్యారు. మత్తు మందు ప్రభావంతో దంపతులు మంగళవారం మధ్యాహ్నం వరకు అలాగే ఉన్నారు. దోపిడి సమయంలో ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అన్నిగేట్లకు పకడ్బందీగా తాళాలు వేసి దుండగలు పారిపోయినట్లు సమాచారం. మధ్యాహ్నం కాలనీలో ఇంటి వైపు వచ్చిన స్థానికులను గుర్తించిన ఫ్రొఫెసర్ కిటికీలో నుంచి అరవడంతో తలుపులు తీశారు. ఈ దోపీడిలో ఏడుగురు పాల్గొన్నట్లు తెలిసింది. స్థానికుల సహాయంతో జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దుండగలు దోపిడీకి పాల్పడి నేపాల్ పారిపోయినట్లు పోలీసులు తెలియజేస్తున్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు చెబుతున్నారు. బస్టాండ్ లు, రైల్వే స్టేషన్లలో సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.






