- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిధులున్నా నిర్లక్ష్యమేనా? ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేసిన అధికారులు
తల్లిదండ్రులు ఇంటికి దిక్కైతే.. గురుకులంలో ప్రిన్సిపాలే ఆ పిల్లలకు దిక్సూచి.

దిశ, కొత్తగూడ: తల్లిదండ్రులు ఇంటికి దిక్కైతే.. గురుకులంలో ప్రిన్సిపాలే ఆ పిల్లలకు దిక్సూచి. విద్యార్థుల సంక్షేమం, భద్రత, ఆరోగ్యం, మౌలిక వసతులు, క్రమశిక్షణ.. ఇవన్నీ పాఠశాల యాజమాన్యం భుజాలపై ఉండే బాధ్యతలు. అయితే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్ గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులు కనీస అవసరాల కోసం రోడ్డెక్కాల్సి రావడం చివరకు ప్రిన్సిపాల్ సస్పెన్షన్‌కు దారితీసింది. తాగునీరు, టాయిలెట్ల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థినులు గురుకుల గేటు ఎదుట ఆందోళన చేపట్టడంతో వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సంఘం కార్యదర్శి సీతలక్ష్మి సీరియస్‌గా స్పందించి ప్రిన్సిపాల్(ఎఫ్‌ఏసీ) కల్పనను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఏప్రిల్‌లోనే రూ.7 లక్షలు.. జులైకి కూడా మరమ్మతులు లేవు
సస్పెన్షన్ ఉత్తర్వుల్లో అత్యంత కీలకంగా ప్రస్తావించిన అంశం టాయిలెట్ల మరమ్మతుల కోసం 2026 ఏప్రిల్‌లోనే రూ.7 లక్షలు విడుదల కావడం. నిధులు విడుదలైనప్పటికి టాయిలెట్ల మరమ్మతులకు అవసరమైన చర్యలు తీసుకోలేదని కార్యదర్శి ఉత్తర్వులో స్పష్టంగా పేర్కొన్నారు. దీంతో విద్యార్థినులు టాయిలెట్ల వినియోగం, తాగునీటి సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని నమోదు చేశారు. దీనిని విధుల నిర్వహణలో తీవ్రమైన నిర్లక్ష్యంగా పరిగణిస్తూ సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు.
స్పందించిన మంత్రి సీతక్క..
విషయం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క దృష్టికి వెళ్లడంతో ఆమె స్వయంగా విద్యార్థినులతో మాట్లాడి భరోసా ఇచ్చారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాతే టాయిలెట్ల మరమ్మతు పనులు ప్రారంభమైనట్లు సమాచారం.
సస్పెన్షన్‌తో కథ ముగిసిందా?
ప్రిన్సిపాల్ సస్పెన్షన్‌తో మొదటి చర్య తీసుకున్నప్పటికీ, పాఠశాల నిర్వహణ, మౌలిక వసతుల పర్యవేక్షణ, విడుదలైన నిధుల అమలు, బాధ్యతల నిర్వహణ పై పూర్తి స్థాయి విచారణ జరపాలని గిరిజన సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థినులు ఎదుర్కొన్న పరిస్థితులకు కారణాలేమిటి? విడుదలైన నిధుల అమలు ఎందుకు ఆలస్యమైంది? పర్యవేక్షణలో లోపాలు ఎక్కడ జరిగాయి? వంటి ప్రశ్నలకు సమాధానాలు రావాలని వారు అభిప్రాయపడుతున్నారు.






