NEET లో తక్కువ మార్కులు.. 16వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య

by Muthe.Rajitha |

దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ (NEET-UG) రీ-ఎగ్జామ్ ఫలితాలు గురువారం వెలువడిన క్రమంలో హరియాణాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది.

NEET లో తక్కువ మార్కులు.. 16వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ (NEET-UG) రీ-ఎగ్జామ్ ఫలితాలు గురువారం వెలువడిన క్రమంలో హరియాణాలో అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. పరీక్షలో ఆశించిన మార్కులు రాలేదనే తీవ్ర మనస్తాపంతో, మానసిక ఒత్తిడికి గురైన ఓ విద్యార్థిని తాము నివసిస్తున్న అపార్ట్‌మెంట్ 16వ అంతస్తు నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడింది. హరియాణాలోని ఫరీదాబాద్‌లో శుక్రవారం మధ్యాహ్నం ఈ దారుణం జరిగింది. మృతురాలు ధన్విత కుటుంబం ఏపీలోని విజయవాడ నుంచి కొన్నేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం హరియాణాలోని ఫరీదాబాద్ పట్టణానికి వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. చిన్నప్పటి నుంచి చదువులో రాణిస్తున్న ధన్విత, డాక్టర్ కావాలనే లక్ష్యంతో ఇటీవల దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ రీ-ఎగ్జామ్‌కు హాజరైంది.

నేషనల్ ಟెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూన్ 25న విడుదల చేసిన ప్రాథమిక 'కీ' (Preliminary Key) ని చూసుకున్నప్పటి నుంచే ధన్విత తీవ్ర ఆందోళనకు గురైంది. తాను కష్టపడి చదివినప్పటికీ చాలా తక్కువ మార్కులు వస్తుండటాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. తల్లిదండ్రులు దైర్యం చెప్పినప్పటికీ ఇంట్లో ఎవరితోనూ సరిగ్గా మాట్లాడకుండా, ఒంటరిగా ఉంటూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది.

ఈ నేపథ్యంలో గురువారం విడుదలైన అధికారిక ఫలితాల్లో.. మార్కులు తక్కువగా రావడంతో ధన్విత తీవ్ర మనస్తాపానికి గురైంది. మానసిక వేదన భరించలేక శుక్రవారం మధ్యాహ్నం వారు నివసిస్తున్న అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని 16వ అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందకు దూకేసింది. రక్తపు మడుగులో ఉన్న ఆమెను కుటుంబసభ్యులు తక్షణమే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే మరణించిందని పరీక్షించిన వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో ఫరీదాబాద్‌లోని సదరు అపార్ట్‌మెంట్‌లో విషాద ఛాయలు అలముకోగా, విజయవాడలో ఉన్న ఆమె బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు. స్థానిక పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story