వ్యక్తి మృతికి కారణమైన లారీ డ్రైవర్‌పై కేసు నమోదు

by Ratna Kumari |

ద్విచక్ర వాహనదారుడు మృతికి కారణమైన లారీ డ్రైవర్‌పై తిరుమలాయపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు.

వ్యక్తి మృతికి కారణమైన లారీ డ్రైవర్‌పై కేసు నమోదు
X

దిశ, తిరుమలాయపాలెం : ద్విచక్ర వాహనదారుడు మృతికి కారణమైన లారీ డ్రైవర్‌పై తిరుమలాయపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ గ్రామానికి చెందిన లింగంపల్లి మురళీధర్‌పై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై కూచిపూడి జగదీశ్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం రూరల్‌లోని శ్రీ సిటీకి చెందిన జోగా సతీశ్ (33), తండ్రి కోటేశ్వరరావు, ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి మరిపెడ బంగ్లా వైపు నుంచి శ్రీ సిటీలోని తన నివాసానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెం గ్రామ సమీపంలోని బ్రిక్స్ ఫ్యాక్టరీ వద్ద రోడ్డుపై నిలిపి ఉన్న టీజీ–30–టీ–0819 నంబర్ గల గ్రానైట్ లారీని వెనుక నుంచి ఢీకొన్నాడు.

ఈ ప్రమాదంలో సతీశ్ తలకు తీవ్ర గాయాలు కావడంతో ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై కూచిపూడి జగదీశ్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతుడి తండ్రి కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, ఎలాంటి హెచ్చరికలు లేదా భద్రతా చర్యలు తీసుకోకుండా రోడ్డుపై నిర్లక్ష్యంగా లారీ నిలిపివేసినందుకు లారీ డ్రైవర్ లింగంపల్లి మురళీధర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై కూచిపూడి జగదీశ్ తెలిపారు.

Next Story