- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హత్య కేసులో నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష
మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నేరం రుజువుకావడంతో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ నిజామాబాద్ ప్రథమ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించినట్లు పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య తెలిపారు.

దిశ, నిజామాబాద్ ప్రతినిధి : మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్య కేసులో నేరం రుజువుకావడంతో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ నిజామాబాద్ ప్రథమ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించినట్లు పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య తెలిపారు. సీపీ వెల్లడించిన వివరాల ప్రకారం.. మెండోరా మండలం దూద్‌గావ్ గ్రామానికి చెందిన భాగ్యవతి ఇంటికి ఎదురుగా నిందితుడు బుచ్చన్న ఇంటి ముందు ఉన్న వేపచెట్టుకు సంబంధించిన వివాదం ఇరు కుటుంబాల మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 2022 జూన్ 2న ఉదయం సుమారు 9 గంటలకు భాగ్యవతి కుమారుడు వసంత్‌తో బుచ్చన్న వాగ్వాదానికి దిగాడు. అనంతరం చంపాలనే ఉద్దేశంతో వసంత్ తలను పట్టుకుని గోడకు మూడుసార్లు బలంగా కొట్టడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ వసంత్ మృతి చెందాడు. అంత్యక్రియల అనంతరం మృతుడి కుటుంబ సభ్యులు మెండోరా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ బి.గోవర్ధన్ రెడ్డి కేసును దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి, అవసరమైన సాక్ష్యాధారాలను సేకరించి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు.
విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ సమర్పించిన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన నిజామాబాద్ ప్రథమ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి హరీష్ నిందితుడు బుచ్చన్నపై నేరం రుజువైనట్లు నిర్ధారించారు. దీంతో నిందితుడికి 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా మూడు నెలల సాధారణ కారాగార శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు నిర్వహించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి ఆర్మూర్ రూరల్ సీఐ బి.గోవర్ధన్ రెడ్డి, ప్రస్తుత ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి. నర్సింహారెడ్డి, కోర్టు లైజనింగ్ అధికారి ఎస్‌ఐ గోవింద్, ఏఎస్‌ఐ సీహెచ్. మురళీధర్ రాజు, కోర్టు డ్యూటీ అధికారులు కానిస్టేబుళ్లు ఎం. విషన్ గౌడ్, ఎన్.లక్ష్మణ్, ఎస్.రాజులను పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య అభినందించారు.






