- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీ రాగా పాఠశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి
శ్రీ రాగా పాఠశాల ప్రభుత్వం నిర్దేశించిన విద్యాశాఖ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ పీడీఎస్‌యూ, పీడీఎస్‌వై, డీఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు.

దిశ, కొత్తగూడెం సింగరేణి : స్థానిక శ్రీ రాగా పాఠశాల ప్రభుత్వం నిర్దేశించిన విద్యాశాఖ నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ పీడీఎస్‌యూ, పీడీఎస్‌వై, డీఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం పాఠశాల ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు బుర్ర వీరభద్రం, జిల్లా కార్యదర్శి దుర్గం ప్రణయ్, డీఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కేలోత్ సాయికుమార్, కోశాధికారి గుగులోత్ సూర్యప్రకాశ్ మాట్లాడుతూ.. పాఠశాల చట్టబద్ధమైన షిఫ్టింగ్ అనుమతులు లేకుండానే కొనసాగుతోందని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల నిర్వహణ జరుగుతోందని, షిఫ్టింగ్ అనుమతులను తిరస్కరించాలని ఇప్పటికే ఆర్జేడీకి ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు తీసుకోకుండా గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
అర్హత కలిగిన ఉపాధ్యాయులు లేకుండానే బోధన నిర్వహిస్తున్నారని, అనర్హులతో పాఠాలు చెప్పిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రత, విద్యా ప్రమాణాల విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కొంతమంది విద్యార్థులు మత్తు పదార్థాల బారిన పడుతున్నారని, బహిరంగంగా మత్తు పదార్థాలు వినియోగిస్తున్నప్పటికీ వాటిని అరికట్టేందుకు లేదా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంలో యాజమాన్యం విఫలమైందని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తు, భద్రత విషయంలో యాజమాన్యం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. అలాగే పాఠశాల కేంద్రంగా అక్రమంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల విక్రయం, అనుమతులు లేకుండా హాస్టల్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. విచారణలో నిబంధనల ఉల్లంఘనలు నిజమని తేలితే సంబంధిత యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ నాయకులు అరుణ్, ఉదయ్, జీవన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.






