స్నేహితుడి హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

by Taduka Kalyani |

స్నేహితునికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా అడిగినందుకు దారుణంగా హత్య చేసిన నిందితుడికి రాజేంద్రనగర్ పదవ అడిషనల్ డిస్టిక్ జడ్జ్ డి. అపర్ణాదేవి నిందితుడికి జీవిత ఖైదీతో పాటు 15 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

స్నేహితుడి హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
X

దిశ, రాజేంద్రనగర్ : స్నేహితునికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోగా అడిగినందుకు దారుణంగా హత్య చేసిన నిందితుడికి రాజేంద్రనగర్ పదవ అడిషనల్ డిస్టిక్ జడ్జ్ డి. అపర్ణాదేవి నిందితుడికి జీవిత ఖైదీతో పాటు 15 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన నిస్సార్ అహ్మద్ (40) బతుకుతెరువు కోసం నగరానికి వలస వచ్చాడు. తమిళనాడుకు చెందిన ఇంతియాజ్ (35)తో పాటు మరో కొందరితో కలిసి తోలు వ్యాపారాన్ని నిర్వహించేవాడు. వీరంతా మెహిందీపట్నం తో పాటు అత్తాపూర్ ప్రాంతంలో నివసించేవారు. నిస్సార్ అహ్మద్ ఇంతియాజ్ కు వ్యాపారానికి సంబంధించిన డబ్బులు ఇచ్చేది ఉంది. అడిగిన ప్రతిసారి రేపు మాపు అంటూ దాటవేస్తూ వచ్చాడు. వీరిద్దరూ అత్తాపూర్ చింతల్ మెట్ ప్రాంతంలోని క్లాసిక్ రెసిడెన్సి లోని అపార్ట్మెంట్లో ఉండేవారు. 2017 ఏప్రిల్ 20 తేదీన రాత్రి డబ్బులు విషయమై నిస్సార్ అహ్మద్, ఇంతియాజ్ మధ్య గొడవ జరిగింది.డబ్బులు ఇవ్వాలని గట్టిగా ఇంతియాజ్ అడగడంతో నిస్సార్ అహ్మద్ డోర్ స్టాపర్ గా పెట్టి ఉన్న రాయితో బలంగా తల పై కొట్టాడు. దీంతో సోపాపై పడిపోయిన ఇంతియాజ్ పై అదే రాయితో పలుమార్లు కొట్టి మృతి చెందాడని నిర్ధారించుకున్న అనంతరం మృతదేహాన్ని బాత్ రూమ్ లో వేసి ఇంటికి తాళం వేశాడు. వాచ్ మెన్ కు తాను తిరిగి వస్తానని తెలిపి అక్కడి నుంచి బస్సులో బెంగళూరుకు వెళ్లిపోయాడు. పోలీసులు వచ్చి పట్టుకుంటారన్న భయంతో నాలుగు నెలల పాటు ముంబై కి వెళ్లి అక్కడ పనిచేశాడు. ఇంతియాజ్ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో దుర్గంధం వెదజల్లడంతో అపార్ట్మెంట్ వాసులు అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్య చేసి పారిపోయిన నిస్సార్ అహ్మద్ ను 2018 ఆగస్టు 30వ తేదీన పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో న్యాయమూర్తి శుక్రవారం నిందితుడికి జీవిత ఖైదు విధించడంతో పాటు 15 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

Next Story