మెక్సికో తీరంలో భారీ భూకంపం

by Muthe.Rajitha |

మెక్సికో తీరంలో అత్యంత శక్తివంతమైన భూకంపం (Earthquake) సంభవించింది.

మెక్సికో తీరంలో భారీ భూకంపం
X

దిశ, వెబ్ డెస్క్ : మెక్సికో తీరంలో అత్యంత శక్తివంతమైన భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.4గా నమోదైనట్లు భూగర్భ పరిశోధన సంస్థలు వెల్లడించాయి. మెక్సికోలోని చియాపాస్ తీర ప్రాంతానికి సమీపంలో ఉన్న ప్యూర్టో మాడెరో (Puerto Madero) పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని ఈ భారీ భూకంపం సంభవించింది. భారీ శబ్దంతో ఒక్కసారిగా భూమి కంపించడంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు.

ఈ భూకంప తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే.. మెక్సికోతో సరిహద్దును పంచుకుంటున్న పొరుగు దేశాలైన గ్వాటెమాల, ఎల్ సాల్వడార్‌లలో కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఆయా దేశాల్లోని పలు నగరాల్లో పెద్ద పెద్ద బహుళ అంతస్తుల భవనాలు, కార్యాలయాలు ఒక్కసారిగా ఊగిపోయినట్లు అంతర్జాతీయ మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. సముద్ర తీరానికి సమీపంలో, అత్యంత శక్తిమంతమైన తీవ్రతతో ఈ భూకంపం సంభవించిన నేపథ్యంలో.. పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం మెక్సికో తీర ప్రాంతాలకు తక్షణమే సునామీ హెచ్చరికలను (Tsunami Warning) జారీ చేసింది. తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎత్తైన ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు. కాగా, ఈ విపత్తు కారణంగా జరిగిన ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Next Story