- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీతారామ ప్రాజెక్టు రూపకర్త కేసీఆర్
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీతారామ ప్రాజెక్టును రూపకల్పన చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు.

దిశ, సత్తుపల్లి : ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు సీతారామ ప్రాజెక్టును రూపకల్పన చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. శుక్రవారం సత్తుపల్లి పట్టణంలోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంపై అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓటు చోరీ గురించి మాట్లాడుతుంటే, తెలంగాణలో మాత్రం అభివృద్ధి పనుల క్రెడిట్ చోరీ జరుగుతోందని విమర్శించారు. సీతారామ ప్రాజెక్టు రూపకల్పన పూర్తిగా కేసీఆర్ ఆలోచన ఫలితమేనని పేర్కొన్నారు.
ప్రాజెక్టు క్రెడిట్ కోసం కాంగ్రెస్ మంత్రుల మధ్య పోటీ నెలకొందని, ఒక మంత్రి పర్యటన గురించి మరో మంత్రికి తెలియని పరిస్థితులు వారి అంతర్గత విభేదాలకు నిదర్శనమని ఆరోపించారు. ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని విమర్శించారు. ప్రజలు ఆందోళన వ్యక్తం చేసిన తర్వాతే పంపులను ప్రారంభించారని, ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు రెండో ఎండాకాలాన్ని తలపిస్తున్నాయని అన్నారు. గోదావరి జలాలను సమర్థంగా వినియోగించి రైతులకు సకాలంలో సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఏ సర్వే చూసినా రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేసిన సండ్ర వెంకట వీరయ్య.. కేసీఆర్ హయాంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్రంలో పోలీసులు కాంగ్రెస్ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కూడా ఆరోపించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






