- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తల్లి కన్నీటి వేదన.. కూతురు కలల ఆవేదన
ఉన్నత విద్యతో జీవితాన్ని మార్చుకోవాలనే ఆశలు, ఎన్నో కలలు, ఏడాది పాటు చేసిన కఠోర శ్రమ.. ఇవన్నీ కేవలం మూడు నిమిషాల ఆలస్యంతో కళ్లముందే కరిగిపోయాయి.

దిశ, కొడిమ్యాల : ఉన్నత విద్యతో జీవితాన్ని మార్చుకోవాలనే ఆశలు, ఎన్నో కలలు, ఏడాది పాటు చేసిన కఠోర శ్రమ.. ఇవన్నీ కేవలం మూడు నిమిషాల ఆలస్యంతో కళ్లముందే కరిగిపోయాయి. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామానికి చెందిన ఓ విద్యార్థిని, నీట్ పరీక్ష రాసి వైద్య విద్యలో అడుగుపెట్టాలనే లక్ష్యంతో ఆదివారం నాచుపెల్లి జేఎన్టీయూ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రానికి చేరుకుంది. అయితే నిర్ణీత సమయం దాటిపోవడంతో ఎగ్జామ్ సెంటర్ గేట్ ఆమె భవిష్యత్తుకు అడ్డుగోడగా మారింది. వెంట వచ్చిన తల్లి గుండె కూతురు భవిష్యత్తు కళ్లముందే జారిపోతుండటాన్ని చూసి తల్లడిల్లిపోయింది. అక్కడ విధుల్లో ఉన్న భద్రతా సిబ్బంది కాళ్ల పై పడుతూ, "నా బిడ్డను ఒక్కసారి లోపలికి పంపండి.. ఏడాది శ్రమ వృథా కాకూడదు" అంటూ వేడుకుంది. కానీ నిబంధనల ముందు ఆ తల్లి కన్నీళ్లు, ఆవేదన నిస్సహాయంగా మిగిలిపోయాయి.
ఒకవైపు తల్లి కన్నీటి బాధ.. మరోవైపు పరీక్షా కేంద్రం బయట నిలబడి నిరాశతో కన్నీళ్లు పెట్టుకున్న కూతురు ఆవేదన.. అక్కడున్న ప్రతి ఒక్కరినీ కలచివేసింది. కేవలం మూడు నిమిషాల ఆలస్యం కారణంగా ఏడాది పాటు కష్టపడి సిద్ధమైన పరీక్ష అవకాశమే చేజారిపోవడంతో వారిని తీవ్ర నిరాశకు గురి చేసింది.
నిబంధనలు అవసరమే... కానీ కొన్ని సందర్భాల్లో మానవీయ కోణం కూడా అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కొండగట్టు జేఎన్టీయూ కళాశాలకు సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల ఇలాంటి పరీక్షల సమయంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






